కోవిడ్‌ పై కన్ను

80 Beds Isolation ward in Government Hospital SPSR Nellore - Sakshi

80 పడకలతో పెద్దాస్పత్రిలో ప్రత్యేక వార్డు

ఆత్మకూరు, కావలి, గూడూరులోనూ ప్రత్యేక వార్డులు

కోవిడ్‌–19పై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు

నెల్లూరు(అర్బన్‌):  ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డును ప్రారంభించడంతో పాటు విదేశీయుల కదలికపై కన్నేసిన అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఆత్మకూరు, కావలి గూడూరు పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్, ఫార్మాసిస్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు జాగ్రత్తలతోనే ప్రాణాంతక వైరస్‌కు చెక్‌ పెట్టవచ్చని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.   కోవిడ్‌–19 వైరస్‌ జాడలు హైదరాబాద్‌లో కనిపించడం, రాష్ట్రంలో అక్కడక్కడా అనుమానిత కేసులు నమోదు అవుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం స్థానిక జిల్లావైద్యశాఖ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరించారు.

ఇన్‌చార్జి డీఎంచ్‌ఓ డాక్టర్‌ సీవీ రమాదేవి మాట్లాడుతూ ఈ వ్యాధిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. విపరీతమైన జలుబు, తలనొప్పి, జ్వరం, శ్వాస కోశ సంబంధ సమస్యలుంటే  వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. తినే ప్రతి సారి చేతులు సబ్బుతో, స్పిరిట్‌ వంటి లోషన్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో సరిపడా మాస్క్‌లు సిద్ధం చేశామన్నారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి(డీసీహెచ్‌) డాక్టర్‌ సుబ్బారావు మాట్లాడుతూ చల్లటి ప్రదేశంలో, జనం రద్దీ వద్ద, సినిమా హాళ్లు తదితర ప్రాంతాల్లో కొంత కాలం ప్రజలు ఉండరాదన్నారు. 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే ఈ వైరస్‌ రాదన్నారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.సాంబశివరావు మాట్లాడుతూ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన పల్మనాలజీ వార్డును కోవిడ్‌–19 చికిత్సకు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. 80 బెడ్‌లతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్, ఫార్మాసిస్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. 

కావలి, గూడూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వేడిగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ప్రబలకుండా చేయవచ్చని తెలిపారు. జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నప్పుడు ప్రజలు సాధారణ మాస్క్‌లను వాడితే సరిపోతుందన్నారు. సమావేశంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాధాకృష్ణరాజు, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top