దివిసీమ కాళరాత్రికి @42ఏళ్లు

42 Years To Diviseema Disaster Cyclone - Sakshi

తలచుకుంటే ఇప్పటికీ గుండె జలదరింత 

కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 14,204 మంది మృత్యువాత 

దివిసీమలోనే 8,504 మంది మృతి 

ఉప్పెన వచ్చి నేటితో 42 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేక కథనం

‘‘ముగ్గురు బిడ్డలను నిద్రబుచ్చి, తను కూడా కూర్చుని కునుకుతీస్తూ, నిద్రలోనే బిడ్డలతో సహా అనంతలోకాలకు చేరిన తల్లి... కాళ్ల పారాౖణెనా ఆరకముందే జలసమాధి అయిన నూతన వధువు..’’ ఆ నాటి దివిసీమ ఉప్పెనలో ఎక్కడ చూసినా ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే.. దివిసీమతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రళయ బీభత్సం సృష్టించిన ఆ ఉప్పెన ఉత్పాతానికి నేటితో నలభై రెండేళ్లు. 1977 నవంబర్‌ 19 నాటి ఘోరకలి నుంచి తేరుకుని సాధారరణ పరిస్థితులు రావడానికి దివిసీమకు రెండేళ్లు పట్టింది.  
సాక్షి, అవనిగడ్డ: 1977 నవంబర్‌ 14న బంగాళాతంలో వాయుగుండం ఏర్పడింది. ఒంగోలు – కాకినాడకు మధ్యలో 400 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను క్రమేపీ బలపడి పెను తుపానుగా మారగా, 19వ తేదీన పెను ఉప్పెనై దివిసీమలో భీభత్సం సృష్టించింది. నాగాయలంక మండలం ఎదురుమొండి వద్ద తుపాను తీరం దాటింది. గంటకు 155కి.మీ వేగంతో వీచిన ప్రంచంఢ గాలులు, ఆరు మీటర్ల ఎత్తున ఎగసిన రాకాసి అలలు సముద్ర తీరప్రాంతాన్ని ముంచెత్తి కకావికలం చేశాయి.

సముద్రం నుంచి దివిసీమలోకి 40కి.మీ విస్తీర్ణం వరకూ చొచ్చుకొచ్చిన నీరు 31 గ్రామాలను తుడిచి పెట్టేసింది. దివిసీమతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ప్రళయం సృష్టించిన తుపాను 14,204 మందిని పొట్టన పెట్టుకుంది. దివిసీమలోనే 8,504 మంది మృత్యువాత పడ్డారు.నాగాయలంక మండలం సొర్లగొందిలో 714 మంది, కోడూరు మండలం పాలకాయతిప్పలో 460, చింతకోళ్లలో 590, మూలపాలెంలో 300, ప్రకాశం జిల్లా బాపట్లలో ఓచర్చిలో తలదాసుకున్న వందమంది అది కూలడంతో మరణించారు.
 
ఉప్పెన అనంతరం ఓ శిబిరంలో .. పులిగడ్డ వద్ద ఉప్పెన పైలాన్‌

ఓడలు గల్లంతు.. కొట్టుకు పోయిన రైలు పట్టాలు 
వాల్తేరు–కిరండోల్‌ రైలు మార్గంపై కొండరాళ్లు పడి పట్టాలు పెకలించుకు పోయాయి. ఈ ఉప్పెనకు బంగాళాఖాతంలో చిక్కుకున్న 13ఓడలు గల్లంతయ్యాయి. ప్రభుత్వ     లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 83 గ్రామాల్లో భీభత్సం సృష్టించిన తుపాను వల్ల 33.34లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లగా, 10లక్షల గృహాలు దెబ్బతినగా, 34లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.50లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా, 4లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రళయానికి రూ.172కోట్లు ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఎటు చూసినా శవాల గుట్టలే 
ఊరి పేర్లు మారిపోయాయి 
ఉప్పెన నుంచి దివిసీమ తేరుకునేందుకు రెండేళ్లు సమయం పట్టింది. ఉప్పెన అనంతరం ఎన్నో దేశ, విదేశాల నుంచి వచ్చిన స్వచ్చంద సేవాసంస్ధలు దివిసీమ పునర్నిర్మాణంలో ఎంతో కీలకపాత్ర పోషించాయి. దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు స్వచ్చంద సంస్ధలను ఈ ప్రాంతానికి తీసుకు వచ్చి ఇతోదిక సేవలందించారు. ఉప్పెన అనంతరం సేవలకు గుర్తుగా కొన్ని గ్రామాల పేర్లు మారిపోయాయి. కోడూరు మండలంలో  గతంలో ఉన్న గొల్లపాలెంను రామకృష్ణాపురంను రామకృష్ణ మిషన్‌ దత్తత తీసుకుని పక్కా గృహాలు కట్టించారు. అనంతరం ఈ ఊరు రామకృష్ణాపురంగా మారిపోయింది. నాగాయలంక మండలం దీనదయాల్‌పురం గతంలో మూలపాలెంగా ఉండేది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని పునర్మించడంతో ఈ గ్రామం దీనదయాల్‌పురంగా మారింది.  గణపేశ్వరం గ్రామంలోని ఎస్సీ కాలనీని బిల్లిగ్రాం సంస్థ దత్తత తీసుకుని పునర్నించడంతో బిల్లిగ్రాంనగర్‌గా మారింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top