రాప్తాడులో ముగిసిన 34వ రోజు పాదయాత్ర

YS Jagan 34th day Padayatra Completed - Sakshi

- 13.6 కి.మీ. నడిచిన జననేత జగన్‌

- దారి పొడవునా సమస్యలు విన్నవించుకున్న ప్రజలు

సాక్షి, రాప్తాడు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 34వ రోజు అనంతపురం జిల్లా రాప్తాడులో ముగిసింది. ఉదయం 8.30 గంటలకు రాప్తాడు నియోజకవర్గంలోని రుద్రంపేట బైపాస్‌ వద్ద పాదయాత్ర ప్రారంభించించిన జగన్‌ రాత్రి 7.24 గంటలకు గంగలకుంట-కందుకూరు గ్రామాల మధ్య ముగించారు. పాదయాత్ర మొదలు ఇప్పటివరకు 475.8 కి.మీ. నడిచారు. రాప్తాడు మండలం రుద్రంపేట, కక్కలపల్లి క్రాస్, అనంతపురం రూరల్‌మండలం, తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర సాగింది. 44వ నెంబర్‌ జాతీయ రహదారిలో ప్రజలు పోటెత్తారు. రాప్తాడులో బహిరంగసభ జరిగింది. జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. దారి పొడవునా రైతులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను జగన్‌మోహన్‌ రెడ్డికి విన్నవించుకున్నారు.

అనంతపురం రుద్రంపేట సమీపంలో నడిచి వెళ్తుండగా దారి వెంట ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు చిన్నాపెద్దా పోటీపడ్డారు. అనంతపురంలోని అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థినులు లావణ్య, గాయత్రి జగన్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. కక్కలపల్లి క్రాస్‌ వద్ద టమాటా పండించిన రైతులు ఆయన్ను కలిసి తమ కష్టాలను విన్నవించుకున్నారు. కూడేరుకు చెందిన రమ్యకృష్ణ, హరికృష్ణ దంపతులు జగన్‌ను కలిసి తమ బిడ్డకు నామకరణం చేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు చిన్నారికి రిత్విక్‌ వంశీ కృష్ణ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారి వెంట కూడేరు ఎంపీపీ మహేశ్వరి ఉన్నారు. పుట్టకతోనే వికలాంగులుగా జన్మించిన తన చిన్నారులను ఆదుకోవాలని రుద్రంపేట పంచాయతీకి చెందిన శ్యామలమ్మ కోరింది.

తాగునీటి సమస్య ఉన్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని అనంతపురం నగర శివారులోని చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన పలువురు మహిళలు జగన్‌కు వివరించారు. తమ కాలనీలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఖాళీ బిందెలతో వచ్చిన వారు జగన్‌ను కోరారు. రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు చనిపోయాడని, చంద్రన్న బీమా పథకంలో సభ్యులుగా ఉన్నా ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదంటూ చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన హజరాబీ, హుస్సేన్‌ దంపతులు వాపోయారు. అదే ప్రమాదంలో తనకు చెయ్యి విరిగి వైకల్యంతో బాధపడుతున్నా కనీసం పింఛన్‌ కూడా మంజూరు చేయలేదని హజరాబీ కన్నీటి పర్యాంతమయ్యాడు. స్థానిక ఎమ్మెల్యేని కలిసి న్యాయం చేయాలని కోరితే చెయ్యి పూర్తిగా విరిగితే గాని ఏమీ చేయలేనని సమాధానమిచ్చారని వాపోయారు. అందరి సమస్యలను ఆలకించిన జగన్‌ వారికి న్యాయం చేస్తానని భరోసాయిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top