ఏపీకి 300 విద్యుత్‌ బస్సులు

300 electric buses to AP - Sakshi

విశాఖకు 100, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున..

ఫేమ్‌–2 పథకం కింద కేటాయించిన కేంద్రం

సాక్షి, అమరావతి: ఏపీకి 300 విద్యుత్‌ బస్సులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఫేమ్‌–2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఇన్‌ ఇండియా) పథకం కింద దేశంలో 64 నగరాలకు 5,595 విద్యుత్‌ బస్సులను కేటాయించగా.. ఏపీలోని విశాఖకు వంద బస్సులు, విజయవాడ, అమరావతి, తిరుపతి, కాకినాడలకు 50 చొప్పున మంజూరు చేశారు. ఇప్పటికే విశాఖకు బస్సులు చేరుకుంటున్నాయి. అతి త్వరలో విశాఖలో విద్యుత్‌ బస్సుల్ని తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో బస్సు ఖరీదు రూ. కోటి వరకు ఉండగా, కేంద్రం 40 శాతం రాయితీ ఇవ్వనుంది.

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం (2019–20)లోనే వెయ్యి విద్యుత్‌ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ గతంలోనే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డీజిల్‌ బస్సుల స్థానంలో కాలుష్య రహిత విద్యుత్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ విలీన కమిటీ కూడా నిర్ణయించింది. వెయ్యి బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ (డీహెచ్‌ఐ)కు జూన్‌ నెలలోనే ఆర్టీసీ ప్రతిపాదనలు సమర్పించింది. విద్యుత్‌ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యూ అండ్‌ రెనెవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, ఏపీ ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు సహకారం అందిస్తాయి. ఇప్పటికే 300 బస్సులను కేటాయించడంతో మిగిలిన 700 బస్సుల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  

తగ్గనున్న నిర్వహణ ఖర్చు 
డీజిల్‌ బస్సులు నడపడం వల్ల కిలోమీటరుకు డ్రైవర్‌ జీతభత్యంతో కలిపి రూ. 38 వరకూ ఖర్చవుతోంది. అదే విద్యుత్‌ బస్సు నిర్వహణ ఖర్చు కిలోమీటర్‌కు రూ. 19 వరకే అవుతుందని తేల్చారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా రూ. 10 వేల కోట్లను బడ్జెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఒక్కో విద్యుత్‌ బస్సు 2 గంటల చార్జింగ్‌తో 8 గంటలు ప్రయాణిస్తుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top