ప్రజా సంకల్పం@300 రోజులు 

300 Days for YS Jagan Praja Sankalpa Yatra  - Sakshi

12వ జిల్లా విజయనగరంలో కొనసాగుతున్న పాదయాత్ర  

పాదయాత్ర సాగిన జిల్లాల్లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం 

తమ సమస్యలు వినే నాయకుడు వచ్చారంటూ ఊరూరా ఘన స్వాగతం 

ప్రజలతో మేమేకం.. తిరుగులేని ఆదరణ 

కష్టాలు చెప్పుకున్న తోటపల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులు 

నాలుగున్నరేళ్లుగా అన్నీ కష్టాలేనని వాపోయిన జనం 

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సడలని సంకల్పం, ఒడిదుడుకులను లెక్క చేయని పట్టుదల, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోవాలనే ఆకాంక్ష జననేత వైఎస్‌ జగన్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది నవంబర్‌ 6వ తేదీన ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం 300 రోజుల మైలు రాయిని అధిగమించింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి తొలి అడుగుతో ప్రారంభమైన పాదయాత్ర.. అశేష ప్రజానీకం అపూర్వ  ఆదరాభిమానాల నడుమ అప్రతిహతంగా కొనసాగుతోంది. వెల్లువెత్తిన జన నీరాజనాలు, పోటెత్తిన మహిళల హారతులు, వృద్ధుల ఆశీర్వాదాలు, యువకుల కేరింతల నడుమ జిల్లాలు దాటే కొద్దీ మహోన్నత రూపం దాల్చింది.

ఒక జిల్లా సరిహద్దులు దాటి మరో జిల్లాలోకి ప్రవేశించేటప్పుడు జనం నుంచి లభిస్తున్న ఆదరణ రాష్ట్ర చరిత్రలో చెరగని అధ్యాయంగా నిలుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇంత సుదీర్ఘమైన యాత్రలో లెక్కకు మిక్కిలి గ్రామాలను స్పృశిస్తూ విభిన్న వర్గాల ప్రజలను కలుసుకుంటూ జగన్‌ ముందుకు సాగుతున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగన్‌ యాత్ర ఏ జిల్లాలో సాగుతుంటే అక్కడ రాజకీయ ముఖచిత్రం మారిపోతుండటం అధికార టీడీపీలో కలకలం రేపుతోంది. సామాన్య ప్రజలు, రాజకీయ వేత్తల నుంచే కాకుండా మేధావులు, విద్యావంతుల నుంచి సైతం యాత్రకు సంఘీభావం లభిస్తోంది. గుంటూరు నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రకాశం బ్యారేజి మీదుగా యాత్ర చేరుకున్నపుడు, ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాజమండ్రి వద్ద ఉన్న రైల్‌ కం రోడ్డు బ్రిడ్జిని దాటుతున్నప్పుడు కనిపించిన జనసంద్రం నభూతో.. అంటున్నారు. ఈ రెండు చోట్లా జనం తాకిడికి వంతెనలు ప్రకంపించాయి.   

జేజేలు.. విన్నపాలు.. 
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం 300వ రోజు వైఎస్‌ జగన్‌ విజయనగరం జిల్లా పార్వతీపురం పాత బస్టాండ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కోటవాని వలస, బంటువానివలస, అడ్డాపుశీల క్రాస్, బాచి జంక్షన్, సీతారాంపురం క్రాస్, ఉల్లిభద్ర, గరుగుబిల్లి క్రాస్, కె.రామినాయుడు వలస క్రాస్‌ మీదుగా తోటపల్లి బ్యారేజి వరకు పాదయాత్ర సాగించారు. 300 రోజులు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్‌ చేశారు. ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా దారి పొడవునా అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తోరణాలతో ఘన స్వాగతం పలికారు. తోటపల్లి రిజర్వాయర్‌ను ఆద్యంతం పరిశీలిస్తూ పాదయాత్ర సాగించారు. దారిపొడవునా ప్రజలు జననేతకు సమస్యలు విన్నవించారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు, పింఛన్లు అందడం లేదని వృద్ధులు, దివ్యాంగులు, తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని తోటపల్లి నిర్వాసితులు, ఏళ్లతరబడి పని చేస్తున్నా తమను పర్మినెంట్‌ చేయలేదని కాంట్రాక్టు ఉద్యోగులు, భృతి అందడం లేదని నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సరిగా అమలు కావడం లేదని విద్యార్థులు జననేత దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో అన్నీ కష్టాలేనని వాపోయారు. అందరి సమస్యలు విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  

నాయీబ్రాహ్మణులకెంత కష్టం? 
పార్వతీపురం మండలం అడ్డాపుశీల జంక్షన్‌లో వైఎస్‌ జగన్‌.. ఓ బార్బర్‌ షాపును పరిశీలించారు. ఆ షాపులో రెండు కుర్చీలు, కత్తెరలు, మాసిపోయిన అద్దాలు తప్ప మరే ఇతర అధునాతన పనిముట్లూ లేవు. కనీసం కరెంటు కూడా లేని ఆ షాపు యజమాని లోచర్ల వెంకట రమణ తన కష్టాలను జననేత ఎదుట ఏకరువుపెట్టారు. ‘అయ్యా.. మేము బీదోళ్లం.. రోజుకు రూ.150 రావడం గగనమైపోతోంది. అతికష్టంగా బతుకీడుస్తున్నామ’ని చెప్పాడు. జగన్‌ స్పందిస్తూ.. నాయీబ్రాహ్మణులు బతికేందుకు చాలా కష్టపడుతున్నారని, మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలా ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. సాక్షాత్తు ప్రతిపక్ష నేతే తన సెలూన్‌లోకి వచ్చి తన కష్టసుఖాలను తెలుసుకోవడం పట్ల తనకు చాలా సంతోషంగా ఉందని వెంకటరమణ ఉప్పొంగిపోయాడు. 

నా పిల్లలకు ప్రాణ భిక్ష పెట్టండయ్యా.. 
అయ్యా.. మాది బలిజిపేట మండలం నూకలవాడ. నా పెద్ద కుమార్తె స్వరూప సికిల్‌ సెల్‌ ఎనీమియాతో బాధపడుతోంది. దాంతో ఎప్పటికప్పుడు ఒంట్లో రక్తం తగ్గిపోయి ఆరోగ్యం క్షీణిస్తోంది. నా చిన్న బిడ్డ షాలిని కూడా తరచూ అనారోగ్యంతో బాధపడుతోంది. డాక్డర్లను సంప్రదిస్తే చిన్నమ్మాయికి కూడా సికిల్‌ సెల్‌ ఎనీమియా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తక్షణమే వైద్యం చేయించుకోవాలన్నారు. కూలి పనులు చేసుకునే నేను నా బిడ్డలకు తరచూ రక్తం ఎక్కించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా పిల్లల వైద్య సేవలకు సాయం అందించి ప్రాణ భిక్షపెట్టాలన్నా.. ఇప్పటి వరకు ముగ్గురు పిల్లలు చనిపోయారు. ఇప్పుడున్న ఇద్దరినైనా దక్కించుకోవాలని ఉంది. భార్య కూడా సుగర్‌ వ్యాధితో బాధపడుతోంది.  
– బొత్స పెంటయ్య  

ఈ సర్కారు మమ్మల్ని చిన్న చూపు చూస్తోంది 
అన్నా.. మేమంతా వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన హెల్త్‌ అసిస్టెంట్లుగా 15 ఏళ్లుగా పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని రెగ్యులర్‌ చేస్తామని చెప్పి మోసం చేశారు. గతంలో మాకు 100 శాతం గ్రాస్‌ శాలరీ ఇచ్చేవారు. 2018 నుండి ఆ పద్ధతి మార్చేసి కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. జిల్లాలో 10 మంది కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్లు మరణిస్తే, వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కుటుంబాలది దయనీయ  పరిస్థితి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జీఓ నెంబర్‌ 10 ద్వారా పీఆర్‌సీ ఇచ్చారు. ఇప్పుడు ఆ విధానాన్ని కూడా తీసేశారు. డీఎస్సీ ద్వారా ఎంపికైన మమ్మల్ని ఈ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తోంది. హెల్త్‌కార్డులు, రేషన్‌ కార్డులు లేవు. ఉద్యోగ భద్రత కరువైంది. మీరు అధికారంలోకి రాగానే మా సమస్యలు పరిష్కరించాలి. 
– పార్వతీపురం డివిజన్‌ హెల్త్‌ అసిస్టెంట్లు వెంకటప్పయ్య, రాధాకృష్ణ, కె.జి.ప్రసాద్, ఈశ్వరరావు 

సిలబస్‌ పెంచి అన్యాయం చేశారన్నా.. 
అన్నా.. మాది పార్వతీపురం మండలం బంటువానివలస. ఈ ప్రభుత్వం డీఎస్సీలో భాగంగా నిర్వహిస్తున్న టెట్‌ కమ్‌ టీఆర్టీలో డీఎడ్‌ అభ్యర్థులకు సిలబస్‌ పెంచి తీవ్ర అన్యాయం చేశారు. బీఈడీ అభ్యర్థులతో సమానంగా డీఈడీ అభ్యర్థులకూ సిలబస్‌ పెంచడం సమంజసం కాదు. ఇప్పటికే ఏడాది పాటు వ్యయ ప్రయాసలతో కోచింగ్‌ తీసుకున్నాం. డిసెంబర్లో పరీక్ష ఉండడం వల్ల పెంచిన సిలబస్‌ కోసం మళ్లీ కోచింగ్‌కు వెళ్లే సమయం లేదు. ప్రభుత్వ నిర్ణయం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది.  
– కట్టోజి అరుంధతి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top