కరెంటోళ్ల కక్కుర్తి..


 


=ఎన్పీడీసీఎల్‌లో అధికారులు, ఉద్యోగుల అక్రమాలు

=తప్పుడు బిల్లులతో రూ.23 లక్షల ఎల్‌టీ సొమ్ము కాజేసిన వైనం

=250 మందికి రికవరీ నోటీసులు జారీ

=యూనియన్ల గొడవతో బిల్లుల బాగోతం బహిర్గతం


 

వరంగల్, న్యూస్‌లైన్ : ఉన్నతాధికారుల నుంచి మొదలు... కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎల్‌టీ బిల్లుల్లో కక్కుర్తి పడ్డారు. రెండేళ్లకోసారి ఇచ్చే లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్(ఎల్‌టీ)ల్లో తప్పుడు దారి పట్టారు. పర్యాటక ప్రాంతాలు, సొంతూళ్లకు వెళ్లకున్నా... వెళ్లినట్లు దొంగ బిల్లులు సృష్టిం చా రు. రైల్వేస్టేషన్ వద్ద దూర ప్రాంతాల నుంచి వెళ్లి, వచ్చిన వారి వద్ద నుంచి టికెట్లు తీసుకు ని... తామే అక్కడికి వెళ్లినట్లు బిల్లులు తయారుచేశారు.



ఇదంతా కిందిస్థాయి ఉద్యోగులే కా దు... ఉన్నతాధికారులు కూడా తప్పుడు బిల్లు లు పెట్టి తమ కక్కుర్తి నిరూపించుకున్నారు. కాగా, ఎన్పీడీసీఎల్‌లో ఈ వ్యహారం ఇప్పుడు అధికారులకు, ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. యూనియన్ నేతల మధ్య తలెత్తిన గొడవల కారణంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కక్కుర్తి బిల్లుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఈ విచారణలో 250 మంది ఉద్యోగులు ఇదే తరహాలో బిల్లులు తీసుకున్నట్లు వెల్లడైంది.



చిన్న చిన్న బిల్లులకు కూడా పెద్ద పెద్ద అధికారులు కక్కుర్తి పడినట్లు విచారణలో వెలుగుచూసింది. దీంతో వారందరి నుంచి తప్పుడు బిల్లుల సొమ్మును రికవరీ చేసేందుకు కార్పొరే ట్ అధికారులు రంగంలోకి దిగి ఒక్కొక్కరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా గతంలో వారు తీసుకున్న ఎల్‌టీ బిల్లు సొమ్మును మొత్తం చెల్లించాలంటూ నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో దొంగ బిల్లులతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సీఎండీ కార్తికేయ మిశ్రా సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 ఎలా చేశారంటే..



వరంగల్ సర్కిల్ పరిధిలోని ఉన్నతాధికారులు మొదలుకుని కిందిస్థాయి సిబ్బంది వరకు రెం డేళ్ల క్రితం తీసుకున్న ఎల్‌టీ బిల్లుల్లో తప్పుడు టికెట్ల వ్యవహారం ఇప్పుడు బట్టబయలైంది. కాలు కదపకున్నా... ఒక్క రోజు సెలవు పెట్టకున్నా... ట్రావెలింగ్ అలవెన్స్‌లు, లీవ్ ట్రావెలింగ్ అలవెన్స్‌లను తీసుకున్నట్లు వెల్లడైంది. ఓ రెండు యూనియన్ల నేతల మధ్య ఈ విషయం లో చిన్న తగాదా జరగడంతో... ఎల్‌టీ బిల్లుల వ్యవహారంపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో సదరు యూనియన్ నేత కూడా మిగిలిన వారంతా ఇదే విధంగా తీసుకున్నారం టూ అధికారులకు ఫిర్యాదు చేశారు.



ఎన్పీడీసీఎల్ సీఎండీగా కార్తికేయ మిశ్రా కొత్తగా వచ్చిన తరుణంలో ఈ ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశాలిచ్చారు. దీంతో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగుచూశాయి. రైల్వే టికెట్లు, సర్వీసు రికార్డులన్నీ బయటకు తీశారు. ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ బిల్లుల్లో కక్కుర్తి పడ్డారు. ఇక్కడ విధుల్లో ఉన్నట్లు రికార్డుల్లో ఉండడం, అదే సమయంలో టూర్‌కు వెళ్లినట్లు రైల్వే బిల్లులు తీసుకోవడంతో అంతా దొరికిపోయారు. మొత్తం 250 మంది అధికారులు, సిబ్బంది ఈ విధంగానే తప్పుడు బిల్లులు సృష్టించి రూ. 23 లక్షల ఎల్‌టీ, టీఏ సొమ్మును డ్రా చేసుకున్నారు.



అధికారులు కూడా ఈ చిన్న బిల్లులకు కక్కుర్తి పడటం ఉన్నతాధికారులకు విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, దొంగ బిల్లుల బండారం బయటపడటంతో అధికారులు 250 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు టికెట్లను పెట్టి తీసుకున్న బిల్లులను వెంటనే తిరిగి చెల్లించాలంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. వీరందరి నుంచి బిల్లుల సొమ్ము రికవరీ చేసిన తర్వాత చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రికవరీ చేసిన తర్వాత తమను వది లేయాలంటూ పలు యూనియన్లు సీఎండీకి విన్నవించారు. కానీ... చిన్న బిల్లులకు తప్పుడు పత్రాలు పెట్టిన వైనంపై సీఎండీ కార్తికేయ మిశ్రా కాస్తంత సీరియస్‌గానే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top