209వ రోజు పాదయాత్ర డైరీ

209th day padayatra diary - Sakshi

09–07–2018, సోమవారం
రాయవరం, తూర్పుగోదావరి జిల్లా

దళారీల కబంధ హస్తాల్లో బందీగా ఉన్నంతకాలం అన్నదాతకు ఈ విషమ పరిస్థితులు తప్పవేమో!
పసలపూడి కథలు పుట్టిన ప్రాంతం.. సిరిసిరిమువ్వ మొదలు.. ఎన్నో గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాల చిత్రీకరణకు వేదిక.. పెద్దజీయర్, చిన్నజీయర్‌ స్వాముల స్వగ్రామమున్న నియోజకవర్గం.. మండపేట. ఈ నియోజకవర్గం అనగానే తాపేశ్వరం కాజా గుర్తుకొస్తుంది. రాష్ట్రంలోనే అత్యధిక రైస్‌ మిల్లులున్న ఈ నియోజకవర్గంలో రెండో రోజు పాదయాత్ర కొనసాగింది. 

అమలాపురం నియోజకవర్గం.. డి పోలవరం నుంచి సోదరుడు కొల్లు ప్రసాదరావు వచ్చి కలిశాడు. అతని తండ్రి సత్యనారాయణ కౌలు రైతు. అష్టకష్టాలుపడ్డా.. వరుస పంటనష్టాల పాలయ్యాడు. అప్పులు తీర్చలేక.. అవమానభారం భరించలేక.. తను ఎంతగానో ప్రేమించిన పొలంలోనే 2016 ఫిబ్రవరిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెలలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందనలేక.. రావాల్సిన ఆర్థిక సాయం అందకపోవడంతో ప్రసాదరావు నా వద్దకు వచ్చి తన కష్టాన్ని చెప్పుకున్నాడు. అప్పుడు నేను లేఖ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆ కుటుంబానికి సాయం అందింది. ఆ విషయమే గుర్తుచేసుకుంటూ నాకు కృతజ్ఞతలు చెబుతుం టే.. ఒక్కసారిగా రైతన్నల దుస్థితి మదిలో మెదిలింది. నాన్నగారు ఈ జిల్లా మీదుగా ఆకాశ మార్గాన పయనించిన ప్రతిసారీ.. పచ్చని ఈ కోనసీమ ప్రాంతాన్ని చూస్తూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ ఇలా ఉంటే ఎంత బావుంటుందోనని పరితపించారు.

తరచూ తన మాటల్లో ఈ విషయాన్ని ప్రస్తావించేవారు. ఆయన తదనంతరం కోనసీమ లో పంటలు వేయకుండా క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ వనరులూ లేని ఉత్తరాంధ్ర, రాయలసీమలాంటి క్షామపీడిత ప్రాంతాలతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో ఈ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు సాధారణమయ్యాయి. కానీ అత్యంత సారవంతమైన నేల.. సాగునీటి వనరులూ ఉన్న కోనసీమలో సైతం రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. రైతురాజ్యం బదులు రాబందుల పాలన సాగుతున్నంతకాలం.. దళారీ ల కబంధ హస్తాల్లో అన్నదాత బందీగా ఉన్నంతకాలం ఈ విషమ పరిస్థితులు తప్పవేమో! సోమేశ్వరం దాటాక.. వరినాట్లు వేసుకుంటున్న మహిళా కూలీలు వచ్చి కలిశారు. రోజంతా కష్టపడ్డా కూలి గిట్టుబాటుకాని తమ కష్టాన్ని చెప్పుకొచ్చారు. నాగమణి అనే సోదరి.. ‘అన్నా.. అసలే కూలి దినాలు తగ్గిపోయి, అంతంతమాత్రం సంపాదనతో కనీస అవసరాలు తీరక అల్లాడిపోతుంటే.. గతంలో నాలుగైదు నెలలు కలిపినా రాని కరెంటు బిల్లులు.. ఇప్పుడు నెలకే వస్తున్నాయి. ఖర్చులన్నీ పెరిగి బతుకు బరువవుతుంటే.. పిల్లల్ని ఎలా చదివించుకో వాలి’.. అంటూ తన  కష్టాన్ని చెప్పుకుంది. ‘మా కూలి బతుకులు మా పిల్లలకు వద్దయ్యా.. వాళ్లను బాగా చదివించాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పెరిగిన ఫీజుల వల్ల అది చేతకావడం లేదు. ఇంటర్‌ పూర్తిచేసిన కూతురి చదువు మధ్యలోనే మాన్పించాల్సి వచ్చింది. ఇంజినీరింగ్‌ చదువుతున్న మరో ఆడబిడ్డను ఎలా గట్టెక్కించాలో అర్థం కాకుండా పోతోంది..’ అని గంగారత్నమణి అనే సోదరి తన నిస్సహాయతను చెప్పుకొంది. పేదలకు కేజీ టు పీజీ ఉచిత విద్య అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన బాబుగారు.. బలహీన వర్గాలకు చెందిన ఈ అక్కచెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు?

సోమేశ్వరానికి చెందిన బత్తుల బుజ్జి, కొండ్రపు శశిరేఖ తదితర అక్కచెల్లెమ్మలు.. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని అర్జీలిచ్చినా ఇళ్లు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో.. పేదవాని సొంతింటి కల నిజం చేయాలని నాన్నగారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ’ పథకాన్ని 2006లో ఈ నియోజకవర్గంలోని పడమరకండ్రిగలోనే ప్రారంభించిన విషయం గుర్తుకొచ్చింది. ఈ కొత్త రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 24 లక్షల పైచిలుకు పేదలకు సొంతింటి కల సాకారమైందంటే.. అది ఆయన చలవే. కానీ నేటి పాలనలో ఆ తపన, చిత్తశుద్ధి కొరవడటం బాధనిపించింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని, అర్హులందరికీ మూడు సెంట్ల స్థలంతో పాటు.. ఉచితంగా పక్కా ఇల్లు కట్టిస్తానని మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కనీసం గుర్తయినా ఉందా? ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏడాదికి లక్ష ఇళ్లు కూడా కట్టని మీరు.. ఎన్నికలకు ఆరు నెలల ముందుగా 19 లక్షల ఇళ్లు పూర్తిచేస్తాననడం మరోసారి ప్రజలను వంచించడం కాదా?   
-వైఎస్‌ జగన్‌   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top