1వ రోజు పాదయాత్ర డైరీ

1st day padayatra diary of praja sankalpa yatra - Sakshi

జనం కళ్లలోని కసితో నా గొంతు శ్రుతి కలిపింది

06–11–2017
వేంపల్లె, వైఎస్సార్‌ జిల్లా

ఇడుపులపాయలో నా పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా నాన్న ఆశీస్సుల కోసం వెళ్లాను. ఆయన సమాధిని నా రెండు చేతులతో తాకి, కళ్లు మూసుకుని దీవించమని కోరుకున్నాను. ఆయన నిండు దీవెనలు ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటాయని నాకు తెలుసు. ఆయన మనకు దూరమైన ఈ ఎనిమిదేళ్ల కాలచక్రం ఆ క్షణంలో ఒక్కసారిగా నా మదిలో మెరిసినట్లయింది. మహానేత హఠాన్మరణం తట్టుకోలేని వందలాది అభిమానులు గుండె పగిలి చనిపోవడం, ఆ కుటుంబాలను ఓదార్చడం నా బాధ్యతగా భావించి నేను బయల్దేరడం, అడ్డుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం, అయినా మడమ తిప్పని వారసత్వానికే నేను కట్టుబడి ఉండడం, అందరూ ఏకమై నన్ను ఒంటరిని చేసి నానా రకాల కుట్రలతో ఇన్నేళ్లుగా వేధించడం.. అంతా గుర్తుకొచ్చింది. ‘ఎన్ని కష్టాలకు గురి చేసినా, నువ్వు పంచిన ఈ రక్తం తలవంచలేదు నాన్నా’ అంటున్న నా గుండె చప్పుడు నాకు స్పష్టంగా వినపడింది. నాన్న కూడా వినే ఉంటారు. ‘నా కుటుంబం చాలా పెద్దది. అది నీకు అండగా ఉంటుంది’ అని అభయమిచ్చి ఉంటారు. 

అక్కడి నుంచే సుదీర్ఘ పాదయాత్రకు తొలి అడుగు వేశాను. ఒకొక్క అడుగు వేయడమే కష్టమైపోయింది. కిటకిటలాడుతున్న జనం, ఉరకలు పరుగులతో వస్తున్న జనం, చెట్ల కొమ్మలపై జనం, రహదారి నిండా ఉప్పెనలా జనం.. నాన్న నాకు ఇచ్చిన పెద్ద కుటుంబం.. అండదండగా నిలబడేందుకు అక్కడికి చేరుకుంది. వాళ్ల కంఠాల్లో ఒక పట్టుదల ప్రతిధ్వనిస్తున్నది. వాళ్ల కళ్లల్లో ఒక కసి నాకు కనబడింది. వాళ్ల కసితో నా గొంతు కూడా శ్రుతి కలిపింది. ఆ సమీపంలోనే జరిగిన బహిరంగ సభలో ‘నాకూ ఒక కసి ఉంది’ అని వాళ్లకు చెప్పాను. ఆ కసేమిటో చెప్పాను. జయజయధ్వానాలతో వాళ్లు ఆమోదించారు. 

మొదటిరోజు కనుక దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానుల సందడి ఎక్కువగా ఉంది. ఆ సందడిలోనూ స్థానిక ప్రజలు చొచ్చుకుని వచ్చి నన్ను అభినందించి పోతున్నారు. ఈ ప్రాంతం పులివెందుల నియోజకవర్గం. నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబాన్ని కళ్లలో పెట్టుకుని చూసుకుంటున్నారీ ప్రజలు. ఈ పరిసరాలు నాకు చిరపరిచితం. ఇక్కడి సమస్యలు నాకు కరతలామలకం. పులివెందుల గడ్డ ఆశలూ, ఆకాంక్షలూ నా ఉచ్ఛ్వాసనిశ్వాసల్లాంటివి. ఇడుపులపాయకు కూతవేటు దూరంలోనే సురభి గ్రామం ఉంది. తెలుగు నాటకరంగ వైభవ పతాకాన్ని వందల యేళ్ల పాటు రెపరెపలాడించిన కళాకారులకు ఈ గ్రామం పుట్టిల్లు. మనసులోనే ఆ కళాకారులకు నమస్కారాలు తెలుపుకున్నాను. మహానేత మరణంతో రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గ ప్రగతి కూడా మందగించింది. పులివెందుల సమీపంలో ప్రతిష్ఠాత్మకమైన పశుపరిశోధనా కేంద్రాన్ని వైఎస్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురాగల ఈ కేంద్రాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇడుపులపాయలో ప్రారంభించిన ట్రిపుల్‌ ఐటీ కూడా మసక బారింది. పోతిరెడ్డిపాడు వరదకాలువ పనులు జరగకపోవడంతో గండికోట ప్రాజెక్టుతో పాటు లింగాల, సింహాద్రిపురం ఎత్తిపోతల పథకాలు ఆగిపోయాయి. ఇవన్నీ చక్కదిద్దాలి. మహానేతే బతికి ఉంటే, ఈ పల్లెలు, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం ఎంత ఎత్తుకు ఎదిగి ఉండేవో కదా అనిపిస్తుంది. ఆయన లక్ష్యాలను పూర్తి చేయాలి. 

మధ్యాహ్నం ఇడుపులపాయ సమీపంలోనే∙భోజనానికి ఆగాము. సాయంత్రానికి పది కిలోమీటర్లు నడిచి వేంపల్లె చేరుకొని రాత్రి బస చేశాము. సంకల్ప యాత్ర ప్రారంభం రోజున నాన్న ఆశీస్సులు తీసుకునే ముందు, తరువాత మధాహ్నం మరోసారి వర్షం రావడం చాలా శుభసూచకం. ఈ పాదయాత్రకు దేవుని ఆశీస్సులు కూడా లభించినట్లే అనిపించింది.    – వై.ఎస్‌. జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top