194వ రోజు పాదయాత్ర డైరీ

194th day padayatra diary - Sakshi

20–06–2018, బుధవారం
శివకోడు, తూర్పుగోదావరి జిల్లా

మీ అవినీతి, నిర్లక్ష్యం నుంచి 108కీ మినహాయింపు లేదా?
నాసికాత్రయంబకంలో పుట్టిన గోదారమ్మ.. సాగర సంగమం చెందే పవిత్ర స్థలమైన అంతర్వేది ఈ రాజోలు నియోజక వర్గంలోనే ఉంది. ఆధ్యాత్మిక ప్రాశస్థ్యానికి పేరెన్నికగన్న నవ నారసింహ ఆలయాల్లో ఒక్కటైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయమూ అంతర్వేదిలోనే ఉంది. 

‘రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సర్వశ్రేయోనిధి ద్వారా ఒక్క అంతర్వేది ఆలయానికే కోట్ల రూపాయలిచ్చి, ఆ పుణ్యక్షేత్ర రూపురేఖల్నే మార్చేశారు మీ నాన్నగారు. అలాగే.. దిండి రిసార్ట్స్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కోనసీమ పర్యాటక రంగానికి దేశవ్యాప్త గుర్తింపునూ తెచ్చారు’ అంటూ ఈ ప్రాంతంతో నాన్నగారికి ఉన్న అపురూప అనుబంధాన్ని ఇక్కడివారు నాతో పంచుకుంటుంటే చాలా గర్వంగా అనిపించింది.  

ఉదయం కలిసిన మోరీ గ్రామ ప్రజలు.. చంద్రబాబుగారి మరో వంచనను నా ముందుంచారు. 2016, డిసెంబర్‌ 29న బాబుగారు.. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మోరీ గ్రామాన్ని స్మార్ట్‌ విలేజ్‌గా ప్రకటించారు. తన సిఫార్సుల మేరకే మోదీగారు పెద్దనోట్లు రద్దు చేశారని, ఆ ఘనత తనదేనని, ఈ గ్రామం రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదురహిత లావాదేవీలు జరిగే గ్రామమని ఘనంగా ప్రకటించారు. గ్రామం మొత్తాన్ని ఫైబర్‌ గ్రిడ్‌తో అనుసంధానం చేస్తానని, బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మారుస్తానని, ఈ గ్రామస్తులకు పెద్ద పెద్ద కార్పొరేట్‌ కంపెనీలలో ఉపాధి అవకాశాలు రానున్నాయని అరచేతిలో స్వర్గం చూపించారు. కానీ మాటలు కోటలు దాటినా.. చేతలు గడప దాటలేదన్నట్లుంది పరిస్థితి. ఇది కూడా ‘భ్రమరావతి’ లాంటి మరో బాబుగారి మార్కు గ్రాఫిక్స్‌ సినిమా.. అంటూ నిర్వే దం వ్యక్తం చేశారు. అబద్ధాలతో, మోసాలతో, వంచ నతో కాలాన్ని వెళ్లబుచ్చాలనుకునే వారి వల్ల ఒరిగేదేమీ ఉండదు.. ఆశించినవారికి భంగపాటు తప్ప.పక్కనే గోదారి ఉన్నా గుక్కెడు మంచినీటికి గతిలేదంటూ వాపోయారు పొదలాడ గ్రామస్తులు. ఆయిల్‌ కంపెనీలు, ఆక్వా సాగే దీనికి కారణమన్నారు. పట్టించుకోని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘బాటిల్‌ రక్తం ఇస్తే కనీసం ఒక గ్లాసు జ్యూస్‌ అయినా ఇస్తారు.. అటువంటిది ఈ ప్రాంతంలోని చమురునంతా లాగేసి వేలకోట్ల విలువైన సంపదను తీసుకెళుతున్నా.. మాకు గుక్కెడు రక్షిత మంచినీరు ఇవ్వలేరా.. కనీస సౌకర్యాలు కల్పించలేరా.. వీసమెత్తు అభివృద్ధి అయినా చేయలేరా.. స్థానికులకు ఉద్యోగాలైనా ఇవ్వలేరా’ అంటూ సర్కారుపై ప్రశ్నల పరంపర సంధించారు.. తూర్పుపాలెం, గొల్లపాలెం గ్రామస్తులు. గ్యాస్‌ లీకేజీలతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా.. తమ పక్షాన నిలవని ప్రభుత్వంపై కన్నెర్ర జేశారు. నాలుగేళ్లు గడిచినా ఒక్క హామీ నెరవేరని నగరం దుర్ఘటన బాధితుల దయనీయ స్థితిని గుర్తుచేసుకున్నారు. అలాంటి దుర్ఘటన మా ప్రాంతంలో జరిగితే మా పరిస్థితేంటి.. అంటూ భయాందోళనలు వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో 108 వ్యవస్థ జబ్బుచేసి పడకేసిందన్నారు.. తూర్పుగోదావరి జిల్లా 108 సిబ్బంది. ఈ రాజోలు నియోజకవర్గంలో ఒక్క 108 వాహనమూ తిరగడం లేదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నాన్నగారి హయాంలో దాదాపు 300 రకాల మందులుంటే.. నేడు 90 కూడా లేవన్నారు. ఆక్సిజనూ లేదు.. అత్యవసర మందులూ లేవు.. సిబ్బంది పరిస్థితి మరీ దారుణమన్నారు. ఉద్యోగ భద్రత లేదు.. ఇస్తున్న చాలీచాలని జీతాల్లో సైతం కోతలు విధిస్తున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే వేధిస్తున్నారని వాపోయారు. చేయని పాపానికి ప్రజాగ్రహానికి గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ రాజన్న తరహా పాలన వస్తుందన్న ఆశతోనే ఈ ఉద్యోగాలను పట్టుకుని వేలాడుతున్నామని గుండెల్లోని బాధను చెప్పుకొ చ్చారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా.. 108 వాహనాలు మూలనపడ్డ విషయం ప్రజలు చెబుతూనే ఉన్నారు. సిబ్బంది కూడా ధ్రువీకరిస్తున్నారు. ఒక్క 108 వాహనమూ అందుబాటులో లేని నియోజకవర్గాలు అనేకం కనిపిస్తున్నాయి. రాజోలే దీనికి ఉదాహరణ. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రంలో 108 వాహనాలు అనేకం మూలనపడ్డా.. మీ కోర్‌ డ్యాష్‌ బోర్డులో మాత్రం అన్ని వాహనాలూ సక్రమంగా తిరుగుతున్నట్టు చూపెట్టడం వెనక మతలబు ఏంటి? తిరగని వాటికి బిల్లు చేసుకోవడమేనా? పేదల ప్రాణాలు కాపాడే 108 లాంటి అత్యవసర సర్వీసులకు సైతం మీ అవినీతి, నిర్లక్ష్యం నుంచి మినహాయింపు లేదా?  
-వైఎస్‌ జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top