192వ రోజు పాదయాత్ర డైరీ

192rd day padayatra diary - Sakshi

18–06–2018, సోమవారం 
పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా 

లంక గ్రామాల ప్రజల దుస్థితిని పట్టించుకోరీ పచ్చ నాయకులు
ఈ రోజు ఉదయం నుంచి ఎంతోమంది తల్లులు తమ చిన్నారులను ఎత్తుకుని వచ్చారు. నామకరణం చేయన్నా.. అనేవారు కొందరైతే, అక్షరాభ్యాసం చేయించాలనే వారు మరికొందరు. రోజుల బిడ్డలు మొదలుకుని.. ముద్దు ముద్దు మాటలు మూటగట్టే చిన్నారులను చూస్తుంటే మనసుకెంతో సంతోషం కలిగింది. చిన్నారుల సాన్నిహిత్యం, భగవంతుని సన్నిథానం ఒక్కటే అంటారు. ఆ చిన్న బిడ్డలతో గడిపే కొద్దిక్షణాలు.. అంతవరకూ పడ్డ కష్టాన్ని మటుమాయం చేస్తున్నాయి. అలాంటి పసిబిడ్డలకు బంగారు భవితను ఇవ్వగలిగితే.. ఆ తల్లుల సంతోషాన్ని వర్ణించగలమా? ఆ అవకాశం వస్తే.. అంతకన్నా అదృష్టం ఉంటుందా.. 

ఒక చిత్రకారుడు తన కుంచెతో అద్భుతమైన చిత్తరువు గీసినట్టుగా.. ప్రకృతికి కొత్త రంగులద్దే మొక్కల్ని సృష్టిస్తారు కడియం నర్సరీ రైతన్నలు. వృక్ష శాస్త్రవేత్తలను తలపించే వారి ప్రతిభకు ప్రకృతి వశమైపోయినట్లుగా.. వందల, వేల కొత్తరకపు వంగడాలు, పూల మొక్కల సృష్టి జరుగుతుందక్కడ. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన అట్టి కడియం నర్సరీ రైతన్నలు.. ఈ ఏలుబడిలో తాము పడుతున్న కష్టాన్ని చెప్పుకొచ్చారు. నర్సరీల మనుగడకు సారవంతమైన మట్టే జీవం. అట్టి మట్టిని తోలుకోడానికి సవాలక్ష ఆంక్షలు.. అవరోధాలు.. అధికారుల వేధింపులు. ఫ్లోరీ కల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్, ఎకో టూరిజం సెంటర్‌.. అంటూ ఆశపెట్టి మోసం చేశారీ పాలకులు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు చంద్రబాబుగారు అడుగుకో మొక్క నాటి అమరావతిని హరితమయం చేస్తానని, గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని అని వట్టి మాటలు చెబుతారు. కానీ మొక్కలు పెంచే నర్సరీ రైతన్నలకు మాత్రం మొండిచెయ్యి చూపిస్తారు.. వేధింపులకు గురిచేస్తారు. కుమ్మరులకు మట్టి ఇవ్వరు, నర్సరీలకు సారాన్నీ అందించరు. కానీ.. పేదల భూముల నుంచి, కాలువల నుంచి, చెరువుల నుంచి, నదుల నుంచి జరిగే మట్టి దోపిడీకి మాత్రం నేతృత్వం వహిస్తారు.  

పచ్చదనం పరుచుకున్న ఈ కోనసీమలో.. తమ గుండెల్లోని అలజడిని వినిపించారు లంక గ్రామాల ప్రజలు, కొబ్బరి రైతులు. పి.గన్నవరం అంటేనే రాష్ట్రంలోనే అతి పెద్దదిగా పేరు ప్రఖ్యాతులుగాంచిన కొబ్బరి మార్కెట్‌ గుర్తొస్తుంది. కానీ నేటి పాలకుల తీరుతో పతనావస్థకు చేరుకున్న ఆ మార్కెట్‌ పరిస్థితి, కొబ్బరి రైతుల కష్టాలు, దింపుడు కూలీల కన్నీళ్లు మనసుకెంతో బాధ కలిగించాయి. 

వశిష్ట గోదావరి పాయకు ఆవల ఉన్న నాలుగు లంక గ్రామాల ప్రజలు తమ కష్టాలను, దయనీయ పరిస్థితులను చెబుతుంటే.. చాలా బాధేసింది. ‘మేం బాహ్య ప్రపంచంలోకి రావాలంటే.. పడవల్లో ప్రయాణమే. లేదా పీకల్లోతు నీళ్లల్లో నడిచి వెళ్లడమే. రోగాలు వస్తే నరకయాతనే. తడిచిన బట్టలతో పిల్లలు బడికెళ్లే పరిస్థితులు. అంతిమ సంస్కారానికి సైతం నదిలో నడవక తప్పని పరిస్థితి’ అంటూ ఆ గ్రామాల అక్కచెల్లెమ్మలు తమ బతుకు ఘోషను చెప్పుకొన్నారు. ‘ఎన్నికలప్పటి నుంచి వంతెన కడతామంటూ ఊరించిన పాలకులు.. మళ్లీ ఎన్నికలొస్తున్నా మా వైపు తిరిగి చూడలేదు’ అంటూ కంటతడిపెట్టారు. ఇసుకను దోచుకోవడానికేమో రాత్రికి రాత్రే ఏ అనుమతులూ లేకున్నా.. పేదల భూముల్ని సైతం దురాక్రమణ చేసి.. నదీగర్భంలోకి రోడ్లు, వంతెనలు వేసుకునిమరీ వందల కోట్లు దోచేసుకుంటారు. కానీ.. బతుకుపోరాటం జరుపుతున్న లంక గ్రామాల ప్రజల దుస్థితి మాత్రం పట్టించుకోరీ పచ్చ నాయకులు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రాష్ట్రాన్ని సింగపూర్, జపాన్‌ చేస్తానంటూ మోసపు మాటలు చెబుతున్న మీకు.. కనీస సౌకర్యాలు కరువై ప్రాణాలు పోతున్న ప్రజల కష్టాలు కనిపించవా? మీకు భారీగా ముడుపులు ముడతాయనుకున్న చోట అత్యుత్సాహం ప్రదర్శించిమరీ పనులు చేపడతారు. మిగతా చోట్ల మాత్రం.. కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రజలు ఏళ్ల తరబడి కాళ్లావేళ్లా పడుతున్నా.. చిన్న చిన్న పనులు సైతం చేపట్టకుండా వారి ప్రాణాలతో చెలగాటమాడతారు.. ఇది ధర్మమేనా? 
-వైఎస్‌ జగన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top