189వ రోజు పాదయాత్ర డైరీ

189th day padayatra diary - Sakshi

14–06–2018, గురువారం
ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా

మహిళా సాధికారతకు బాబు అర్థమే లేకుండా చేశారు 
కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నియోజకవర్గంలో ఈ రోజు పాదయాత్ర సాగింది. కాలువగట్టు మీద రోడ్డును పూల తివాచీగా మార్చేసి.. స్వాగతించిన ఇక్కడి వారి అభిమానం కదిలించింది. అచ్చమైన సంప్రదాయ కోనసీమ గ్రామీణ సంస్కృతి, కోనసీమ జనజీవన చిత్రం కళ్లముందు నిలిచింది. ఓ వైపు డెల్టా కాలువ.. ఎత్తిన తెరచాపలా నవరత్నాల ఫ్లెక్సీలను అలంకరించుకుని కాలువలో కదులుతున్న నావలు.. వాటిలో చిరునవ్వులు చిందిస్తున్న నాన్నగారి ఫొటోలు. మరోవైపు అరటి, కొబ్బరి తోటలు. కోనసీమ పరిమళాన్ని ఆస్వాదిస్తూ నడక సాగించాను.  

‘ఒకప్పుడు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు వస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేవాళ్లం.. గోదారమ్మకు వరదొస్తే ఆ సమయంలో కోనసీమ చిగురుటాకులా వణికిపోయేది. ఈ రోజు గుండెలమీద చెయ్యి వేసుకుని పడుకుంటున్నామంటే.. ఏటిగట్లను పటిష్టం చేసిన మీ నాన్నగారి చలవే’ అంటూ రైతన్నలు నాన్నగారి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.   

‘ధీమా ఇవ్వని చంద్రన్న బీమా.. ఇచ్చిన హామీలనూ మరిచిన బాబుగారు’ అంటూ కష్టాలు చెప్పుకొన్నారు కల్లుగీత కార్మికులు. ‘పట్టించుకున్న నాథుడే కరువై.. వేధింపులకు గురవుతున్న మాకు మీ మాటలే భరోసా’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు విశ్వబ్రాహ్మణులు. అరటిబోదెకు వెదురు కట్టెలాగా.. మా జీవితాలకు ఆసరాగా నిలవాలంటూ విన్నవించారు అరటి రైతులు. ‘ఇంతకుముందు దివ్యాంగులకు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు ఇచ్చేవారు. వాటికీ ఇప్పుడు మంగళం పాడేశారు. దివ్యాంగులను పెళ్లాడినవారికి రూ.లక్ష ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. అదే దంపతులిద్దరూ దివ్యాంగులైతే వారికి ఎలాంటి ప్రోత్సాహకమూ లేదు. ఇదేం న్యాయం? స్కూటీలిస్తాం.. అప్లై చేసుకోండి.. అని ఆశపెట్టి ఏడాది గడిచినా ఇచ్చిన పాపానపోలేదు. వైకల్యం మాకు కాదు.. ఈ ప్రభుత్వ పెద్దలకే..’ అంటూ మధ్యాహ్నం కలిసిన దివ్యాంగులు ఆక్రోశించారు.   

‘మా అతిథ్యాన్ని స్వీకరించండి.. మా పూతరేకుల తీయదనాన్ని ఆస్వాదించండి’ అంటూ ఆత్రేయపురం ఆడపడుచులు ఆప్యాయంగా ఆహ్వానించారు. దేశవిదేశాల్లో ప్రసిద్ధిచెందిన ఆత్రేయపురం పూతరేకుల గురించి.. వారి సాధకబాధకాల గురించి అడిగి తెలుసుకున్నాను. ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహమూ లేకున్నా.. అద్భుత వంటకళా నైపుణ్యంతో స్వయం సమృద్ధి సాధించి.. తెలుగు నేల ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాప్తిచేసిన వేలాదిమంది ఈ ప్రాంత అక్కచెల్లెమ్మల ప్రతిభను అభినందించకుండా ఉండలేకపోయాను. మూగ, చెవుడు సమస్య ఉన్నా.. చెరగని చిరునవ్వుతో పూతరేకులిచ్చి తినమన్న చెల్లెమ్మ అపర్ణ ఆత్మస్థైర్యం కదిలించింది. ఆ బిడ్డకు నాన్న లేడు. అమ్మ కూలి పనులకు వెళుతోంది. ఓ వైపు డిగ్రీ చదువుతూ.. మరోవైపు అమ్మకు ఆలంబనగా నిలిచిన ఆ చెల్లెమ్మకు బంగారు భవిష్యత్తునివ్వాలని మనసులో భగవంతుడిని వేడుకున్నాను.   

‘ఇరవైఏళ్లుగా వీవోఏలుగా పనిచేస్తున్నాం. గత నాలుగేళ్లుగా వేతనాలే ఇవ్వకపోయినా భవిష్యత్తుపై ఆశతో వెట్టిచాకిరీ చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ పథకాలనూ ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు.. అయిష్టంగానైనా పాలకపార్టీ కార్యక్రమాలకు సైతం సేవలందిస్తున్నాం. అయినా మాపట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం’ అంటూ ఆత్రేయపురంలో కలిసిన అక్కచెల్లెమ్మలు కంటతడిపెట్టారు. సాధికార మిత్రల పేరుతో తమ ఉద్యోగాలకు ఎసరుపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పొదుపు సంఘాలను నిర్వీర్యం చేసి, మహిళా సాధికారతకు అర్థమే లేకుండా చేసిన బాబుగారికి సాధికార మిత్రలంటే.. కేవలం ప్రతిపక్షాలపై బురదజల్లేందుకు పనికొచ్చేవారు. అధికార పక్షానికి అండగా లేకపోతే.. సంక్షేమ పథకాలు అందవని బెదిరించేందుకు ఉపయోగపడేవాళ్లు. ఎన్నికల వేళ పాలక పార్టీకి ఉపయోగపడేలా వాడుకోవాలనే దురాశే తప్ప.. వారికి నిజంగా న్యాయం చేద్దామన్న ఆలోచన, చిత్తశుద్ధి బాబుగారికి లేనేలేదు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రెండు దశాబ్దాలుగా సేవలందిస్తూ.. ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని పదేపదే వేడుకుంటున్న వీవోఏలను పట్టించుకోకపోగా.. మీకు అనుకూలమైన వారిని సాధికార మిత్రలుగా నియమించుకుని,  ప్రభుత్వోద్యోగులుగా గుర్తింపునివ్వడం దేనికి సంకేతం? ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం కాదా? సాధికార మిత్రల పేరుతో వీరిని మీ పార్టీ బూత్‌ కమిటీ సభ్యుల్లాగా వాడుకుని.. ఎన్నికల వేళ వారిచేత డబ్బు పంపిణీ చేయించాలనుకోవడమే మీ వ్యూహం కాదా?  
-వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top