164వ రోజు పాదయాత్ర డైరీ

164rd day padayatra diary - Sakshi

17–05–2018, గురువారం
పావులూరివారిగూడెం శివారు, పశ్చిమ గోదావరి జిల్లా

అమాయకులను వేధించుకుతింటున్న వీరినిదోపిడీదారులనక ఏమనాలి?

దక్షిణాముఖుడైన చిన్న వెంకన్న స్వామి వెలసిన ద్వారకా తిరుమల మండలంలో ఈ రోజు ఉదయం పాదయాత్ర సాగింది. వ్యవసాయం, ఉద్యానవన పంటలపై నాన్నగారికి ఉన్న ప్రేమకు ప్రతిరూపమైన వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ గోపాలపురం నియోజకవర్గంలోనే ఉందన్న విషయం గుర్తుకు రాగానే మనసుకి గర్వంగా అనిపించింది. కానీ కాస్త దూరం నడవగానే ఈ ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ధరల పతనం, దళారుల దోపిడీతో బక్కచిక్కిన నిమ్మ, ఇతర ఉద్యానవన పంటల రైతులు కలిసి తమ కన్నీటి కష్టాలను నివేదించారు.

మరికాసేపటికే నన్ను కలసిన హేమలత అనే చెల్లెమ్మ కన్నీటి కథ గుండెను బరువెక్కించింది. ఆమె భర్త ఆకుల సత్యనారాయణ ఓ ఉద్యానవన రైతు. వరుస పంట నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయి, గట్టెక్కే మార్గం కానరాక, ఆత్మస్థైర్యం కోల్పోయి ప్రాణంగా ప్రేమించిన పొలంలోనే ఉరివేసుకుని మరణించాడట. ఉన్న కాస్త పొలాన్ని, పశువులను అమ్మినా భర్త చేసిన అప్పులు తీరక తాను కూలీగా మారి, కన్నబిడ్డను పాలేరుగా మార్చి బతుకుబండిని భారంగా నెట్టుకొస్తున్నానని కన్నీటిపర్యంతమైంది ఆ చెల్లెమ్మ. ఈ పాలనలో రైతన్నలకు ఎంత కష్టం?  

ఈ రోజు పాదయాత్ర సాగిన పంగిడిగూడెం, గొల్లగూడెం గ్రామాల్లో... మండుటెండను సైతం లెక్కచేయకుండా అడుగడుగునా సోదర ప్రేమను పంచుతున్న నా అక్కచెల్లెమ్మలను కలుసుకున్నానన్న ఆనందం ఓ వైపు... పసిబిడ్డలను చంకనేసుకుని ఎండకు వచ్చారన్న బాధ మరోవైపు. ‘నిన్ను చూస్తే చాలయ్యా కడుపు నిండినట్టే’ అంటూ ప్రేమానురాగాలను కురిపించిన రైతు కూలీ సోదరీమణులను చూసి.. నా కోసం పని మానేశారన్న బాధ ఓ వైపు... అలసట మరిచేలా ఆప్యాయతలను పంచారన్న సంతోషం మరోవైపు.

‘నాన్నగారే నడిచొచ్చినట్టుందయ్యా’ అంటూ నడుం వంగిపోయి నడవలేక, నడవలేక నా వద్దకు వచ్చి వణుకుతున్న చేతులతో మనసారా దీవించారు.. పండు ముసలి అవ్వలు. ఆ జన తాకిడిలో ఎక్కడ నలిగిపోతారోనన్న ఆందోళన ఓ వైపు.. అంతటి నిస్సత్తువలో సైతం ఓపిక కూడగట్టుకుని నన్ను ఆశీర్వదించి నా సంకల్ప శక్తి పెంచారన్న ఉద్వేగం మరోవైపు... ఇలాంటి భావోద్వేగాల సమ్మేళనాల మధ్య నడక సాగింది.  

దొరసానిపాడుకు చెందిన గంగమ్మది భరించలేని విషాదం. వంద శాతం వైకల్యం ఉన్న ఆమె బిడ్డ నాగరాజు జన్మభూమి కమిటీల దుర్నీతి పాలనకు బలైపోయాడు. కేవలం నాన్నగారి ఫొటో పెట్టుకున్నాడన్న ఏకైక కారణంతో కక్ష గట్టి, చెప్పి మరీ పెన్షన్‌ తీసేశారట. అధికారుల చుట్టూ తిరిగినా, జన్మభూమి కమిటీల కాళ్లావేళ్లా పడ్డా కనికరించకపోవడంతో నిస్సహాయుడై తీవ్ర మానసిక క్షోభతో ఆ వ్యథనంతా సూసైడ్‌ నోట్‌గా రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ జన్మభూమి కమిటీలు మా వాడి పెన్షనే కాదు... ఉసురు కూడా తీసేశాయని ఆ తల్లి భోరున విలపిస్తుంటే సముదాయించడం ఎవరి తరం?

పుట్టుకతోనే శారీరక, మానసిక వికలాంగుడైన ఎదుగుదల లేని 18 ఏళ్ల కుమారుడిని రెండు చేతులతో ఎత్తుకొచ్చింది బుట్టాయిగూడెంకు చెందిన ఓ తల్లి. అలాంటి దివ్యాంగుడికే కాదు, ఆ ఊరిలోని ఇతరులకు సైతం జన్మభూమి కమిటీలు, సర్పంచ్‌ కలసి ఆ పన్ను, ఈ పన్ను అని చెప్పి పెన్షన్లలో కోతపెడుతూ వేధిస్తున్నారట. రకరకాల సాకులతో వితంతువులకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లలో సైతం కోతపెట్టడం ఎంత దారుణం? నిస్సహాయులైన అమాయక ప్రజల్ని వేధించుకుతింటున్న వీరిని దోపిడీదారులనక ఏమనాలి?

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఎలాంటి చట్టబద్ధత లేని జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా మారి పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేయడం నిజం కాదా? కేవలం అమాయకులైన గ్రామీణ పేద ప్రజలను దోచుకోవడానికి, కక్ష గట్టి వేధించడానికే ఈ కమిటీలు ఏర్పాటు చేశారన్నది వాస్తవం కాదా?  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top