163వ రోజు పాదయాత్ర డైరీ

163rd day padayatra diary - Sakshi

16–05–2018, బుధవారం
పెరుగ్గూడెం శివారు, పశ్చిమగోదావరి జిల్లా 

ఇలాంటి ఘటనలు జరగడానికి మీ అలసత్వమే కారణం కాదా? 
గోదావరి నదిలో లాంచీ ప్రమాదం మాటలకందని మహా విషాదం. అమాయకపు ప్రజల ప్రాణాలు బలిగొన్న వైపరీత్యం.. మనసంతా కలచివేసింది. గల్లంతైనవారంతా ఒక్కొక్కరుగా శవాలై నీటిపై తేలుతున్న వార్తలు వింటుంటే.. గుండె బరువెక్కుతోంది. తల్లిని పోగొట్టుకుని విలపిస్తున్న బిడ్డలు.. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలు.. చేతికి అందివచ్చిన బిడ్డ ఇక లేడని కుమిలిపోతున్న తల్లిదండ్రులు.. వారిని ఓదార్చేవారెవరు? వారేమైపోవాలి? ఏం పాపం చేశారని వారికీ శిక్ష? బోటు యజమానుల దురాశ, అధికారుల కక్కుర్తి ఒక ఎత్తయితే.. ప్రధాన కారణం మాత్రం పాలకుల విశృంఖల అవినీతి, అలసత్వాలే. విపరీతమైన గాలివానలో బోటు నడపొద్దని, ఒడ్డుకు చేర్చాలని కాళ్లావేళ్లా పడ్డా.. కేవలం డబ్బు కోసం.. ఏం జరిగినా ఫర్వాలేదులే పైవాళ్లు చూసుకుంటారులే.. వాళ్లకిచ్చే వాటా వాళ్లకిస్తున్నాం కదా.. అనుకునే బోటు యజమానుల బరితెగింపు ఒకటైతే.. ఎన్ని దుర్ఘటనలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోయినా ఏమీ కాదు.. అనుకూల మీడియాతో జనాన్ని మరిపించవచ్చు.. అక్రమ సంపాదన ఉంటే చాలు.. ఎన్నికల వేళ డబ్బుతో అడ్డదారిలోనైనా అధికారం అందుకోవచ్చునన్న ప్రభుత్వ ముఖ్యుని దుర్మార్గ వైఖరే ఈ ఘోర ప్రమాదానికి మూలకారణం.

గత నవంబర్‌లో కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంలో 22 మంది మరణించినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, రాష్ట్ర ప్రజలు.. ఆ విషాద ఘటనకు కారణమైన నిర్లక్ష్యాన్ని, అవినీతిని వేలెత్తి చూపారు. గుణపాఠం నేర్చుకుంటారని, పునరావృతం కావని ఆశించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే లైసెన్స్‌ లేని, తగిన ప్రమాణాలు లేని బోటులో దేశ ప్రథమ పౌరుడి కుటుంబ సభ్యులనే షికారుకు తీసుకెళ్లారంటే.. ఎంత దుస్సాహసం? ఎంత బరితెగింపు? మొన్నటికి మొన్న మంటల్లో పూర్తిగా కాలిపోయిన బోటులో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించలేదంటే.. వారికి అధికారుల అండదండలు, పాలకుల భరోసా ఎంత ఉన్నట్టు?! ఆ సంఘటన నుంచైనా నేర్చుకోలేదు.

మళ్లీ ఇప్పుడు ఇంత మహా విషాదం జరిగిందంటే.. ఇది ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కాక మరేంటి? మళ్లీ ఈ రోజు కూడా ముఖ్యమంత్రిగారు తన అనుకూల మీడియా ద్వారా వాస్తవాలను మరుగుపరిచి, హడావుడి చేసి, హంగామా చేసి.. జరిగిన తప్పిదాలను, నేరాలను సమాధి చేయడానికి సిద్ధమైపోయారు. మొదటి దుర్ఘటన జరిగినప్పుడే మొసలి కన్నీరు కార్చకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఉంటే.. మళ్లీ మళ్లీ ప్రజల ప్రాణాలు ఇలా గాలిలో కలిసేవా? 

ఈ పెను విషాదం నుంచి త్వరితగతిన కోలుకునే ఆత్మస్థైర్యాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ యంత్రాంగానికి సూచించాను.  

సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజా ప్రతినిధులే సమస్యగా మారితే.. దారి తప్పిన అటువంటి నేతలను నియంత్రించాల్సిన ముఖ్యమంత్రిగారే వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే.. ప్రజల పరిస్థితి దుర్భరం కాక మరేమవుతుంది? అరాచకం రాజ్యమేలక ఇంకేమవుతుంది? దానికి నిదర్శనమే దెందులూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యేనే ఒక సమస్య. అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఇలాంటి ఎమ్మెల్యేలను.. పనితీరు బాగుందంటూ ర్యాంకులిచ్చిమరీ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిగారిని ఏమనాలి? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పుష్కరాల తొక్కిసలాట మొదలుకుని.. ఫెర్రీ ఘాట్‌ బోటు ప్రమాద ఘటన వరకు ఏ ఒక్క దుర్ఘటనలోనైనా వాస్తవాలు బయటికి వచ్చాయా? కమిటీల పేరుతో కాలయాపన, ప్రజాధనం వృథా చేయడం తప్ప.. అసలైన దోషులను కనీసం గుర్తించే ప్రయత్నమైనా చేశారా? ఇలాంటి ఘటనలు పదే పదే జరగడానికి మీ అలసత్వం, అవినీతే కారణం కాదా?  
- వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top