159వ రోజు పాదయాత్ర డైరీ

159th day padayatra diary - Sakshi

12–05–2018, శనివారం
కైకలూరు, కృష్ణా జిల్లా

అగ్రిగోల్డ్‌ మోసగాళ్లకు, మీకు తేడా ఏముంది? మీరు చేసిందీ అదే కదా?!
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, సిరిగోల్డ్, అభయగోల్డ్‌.. పేరేదైనా బాధితులు మాత్రం సామాన్య ప్రజలే. ప్రతినాయకులు మాత్రం నేటి పాలకులే. అభయగోల్డ్‌లో డబ్బు కట్టి, కట్టించి, మోసపోయి, ప్రభుత్వ నిరాదరణకు గురై.. తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉన్న డిపాజిట్‌దారులు, ఏజెంట్లు మండవల్లి వద్ద కలిసి గోడు వెళ్లబోసు కున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి సంపా దించుకున్న సొమ్మును అభయగోల్డ్‌లో పెట్టడమే గాక.. వేడినీళ్లకు చన్నీళ్లలా తోడవుతుందని బంధుమిత్రులతో, తెలిసినవారితో కూడా కట్టిం చారట. కైకలూరు పరిధిలోనే దాదాపు రూ.4 కోట్ల మేర డిపాజిట్లున్నాయట. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఖాతాదారులు ఇంటివద్దకు వచ్చి నిలదీస్తుంటే.. ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మ హత్యలకు పాల్పడ్డ ఏజెంట్లు కూడా ఉన్నారట. ‘సార్‌.. మీ పాలన వస్తుందనే ఆశతో ఉన్నాం. మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం’ అంటూ ఆవేదనను పంచుకున్నారు. ఇలాంటి మోసకారి సంస్థల ఆస్తు లపై కన్నేసిన పాలకు లకు.. బాధిత ఖాతాదారులను ఆదుకునే ఆలోచన ఉంటుందనుకోవడం నిజంగా భ్రమే. తమకు న్యాయం చేయాలని కోరిన అగ్రిగోల్డ్‌ బాధితులతో వ్యంగ్యం, వెట కారం, చీదరింపు, చులకనభావం, అహంకారం తో మాట్లాడిన అమాత్యుడు అయ్యన్నగారి వ్యవహారం గర్హనీయం. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పోగొట్టుకుని, భవిష్యత్తు అంధకారమై, ఆదుకునే నాథుడులేక.. తీవ్ర నిరాశానిస్పృహల్లో ఉన్న బాధితులను ‘అత్యాశకు పోయి అనుభవిస్తున్నారు’ అంటూ హేళన చేయడం అత్యంత అమానుషం. 

వ్యసనాలకు బానిసైన భర్త.. ఇద్దరు పిల్లలతో సహా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోతే.. ఒంటరి స్త్రీ ఎన్ని బాధలుపడాలో, ఎన్ని ఆటు పోట్లు ఎదుర్కోవాలో.. అన్నింటికీ ఎదురొడ్డి నిలిచిన నాగలక్ష్మి అనే చెల్లెమ్మ గాథ స్ఫూర్తి దాయకం. ‘అన్నా.. ఇడ్లీ కొట్టు నడిపాను. బట్టలు కుట్టాను. కష్టపడి బతుకుతుంటే.. వెకిలి చూపులు, వెటకారపు మాటలు బాధించేవి. చచ్చిపోవాలనిపించేది. పిల్లల ముఖాలు చూసి గుండె దిటవుచేసుకున్నాను. నేనే ఆటో నడపడం మొదలెట్టాను. పిల్లలకింత పెట్టి నేనూ తినగలు గుతున్నాను. వాళ్లను బాగా చదివించుకోగలిగితే అంతేచాలు. నాలాంటి అభాగ్యులకు ఓ అన్నలా మీరు తోడుంటారనే నమ్మకం ఉంది’ అని ఆటో నడుపుతున్న ఆ చెల్లెమ్మ బతుకుపోరాటాన్ని కళ్లకు కట్టింది. జీవితం సవాళ్లు విసిరినా.. సమాజం వేధించాలని చూసినా.. నిరాశా నిస్పృహల్లో్ల కూరుకుపోకుండా.. ధైర్యంగా నిలబడి, విధిని ఎదిరించి, ఆత్మగౌరవంతో సగర్వంగా జీవిస్తున్న ఆ చెల్లె్లమ్మను అభినందించకుండా ఉండలేకపోయాను. 

కలిదిండి గ్రామంలోని అల్లూరి సీతారామ రాజు జూనియర్‌ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు, సిబ్బంది కలిశారు. 2011లో ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న ఆ కాలేజీలో అధ్యాపకులకు, సిబ్బందికి అప్పటి నుంచి ఇప్ప టిదాకా జీతాలు రావట్లేదట. ఇదే విషయమై ట్రిబ్యునల్‌కు వెళ్లినా ఆ తీర్పును సైతం ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదట. కొద్దిమంది రిటైర్‌ కూడా అయిపోయారట. ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా.. అన్న ఆశతో అప్పులు చేసి బతుకుబండిని లాగుతున్నారట. ఏడేళ్లుగా జీతాలే చెల్లించకపోతే వారెలా బత కాలి? అయినా ఈ పాలకులకు తమ బినామీల కార్పొరేట్‌ కాలేజీలపై ఉన్న ప్రేమ.. ప్రభుత్వ రంగ విద్యాలయాలపై ఎందుకుంటుంది? 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఆశకు పోయి అనుభవిస్తున్నారంటూ అగ్రిగోల్డ్‌ బాధితు లను అవహేళన చేస్తున్నారు. నిజమే.. రుణ మాఫీ మొదలుకుని.. మీరిచ్చిన బూటకపు హామీలను నమ్మి తమ జీవితాలు బాగుపడతా యోమోనని ఆశకు పోయి.. ప్రజలు మోసపో యారు. మరి అగ్రిగోల్డ్‌ మోసగాళ్లకు, మీకు తేడా ఏముంది? మీరు చేసిందీ అదే కదా?! 
- వైఎస్‌ జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top