ఆనందంగా మొదలై.. ఆవేదనగా..!


* 13వ తేదీనే ముగిసిన 13వ అసెంబ్లీ సమావేశాలు

* తొలిరోజు సంతోషం.. చివరి రోజు నిర్వేదం

* ఐదేళ్లలో 201 రోజులు సమావేశమైన సభ

* 31 గంటలు ప్రసంగించిన చంద్రబాబు

* 38.21 గంటల సభా సమయం వృథా

* 102 బిల్లులకు ఆమోదం

 


సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ గురువారం తన చివరి సమావేశాలను 13వ తేదీనే ముగించుకుంది. 2009లో తొలిరోజు ఆలింగనా లు, పరస్పర అభినందనలతో ఉత్సాహంగా మొదలైన శాసనసభ చివరి రోజు కళతప్పి సభ్యుల నిర్వేదం మధ్య నిరవధికంగా వాయిదా పడింది. ఈ సభాకాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా వ్యవహరించగా.. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా ఇద్దరేసి చొప్పన పనిచేశారు. 13వ శాసనసభ తొలి సమావేశం 2009 జూన్ 6న జరిగింది. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఆ రోజున నిండుగా కళకళలాడింది. చివరి రోజు మాత్రం సగానికి పైగా అసెంబ్లీ సమావేశ మందిరం ఖాళీగా కనిపించింది. మళ్లీ గెలుస్తామో లేదో, రాష్ట్రం విడిపోతే ఇక్కడ కలుసుకుంటామో లేదో అని భారమైన హృదయాలతో వీడ్కోలు చెప్పుకున్నారు.

 

 సీఎం పదవిలో ఉంటూ వైఎస్ మరణం

 2009 జూన్ 8న గవర్నర్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. చివరి బడ్జెట్ సమావేశాల్లో మాత్రం గవర్నర్ ప్రసంగానికి చోటు లభించలేదు. తొలుత సభ 2009 జూన్ 6 -10 వరకు జరిగింది. రెండోసారి అదే ఏడాది జూలై 27 నుంచి సెప్టెంబర్ 1వరకూ సమావేశమైంది. అనంతరం సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ కూలిపోవటంతో చనిపోయారు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా కె.రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో మూడో సమావేశాలు డిసెంబర్ 7- 14 వరకు జరిగాయి. 2010లో నాలుగో విడత ఫిబ్రవరి 16 నుంచి మార్చి 30 వరకూ 30 రోజుల పాటు సమావేశమైంది. ఐదో విడత జూలై  7 నుంచి 15 వరకూ వారం పాటు జరిగింది.

 

 ఆరో విడత సభ డిసెంబర్ 10-16 వరకూ ఆరు రోజుల పాటు సాగింది. ఈ సమావేశాలు ప్రారంభానికి కొద్ది రోజుల ముందు నవంబర్ 24న అప్పటివరకు శాసనసభ స్పీకర్‌గా కొనసాగిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడో విడత సభ  రెండుసార్లు సమావేశమైంది. తొలిసారి 2011 ఫిబ్రవరి 18 నుంచి మార్చి 29 వరకూ సమావేశమైంది. రెండో విడత సమావేశం అదే ఏడాది జూన్ 6వ తేదీన ఒక్క రోజు మాత్రమే జరిగింది. 13వ శాసనసభ ఎనిమిదో విడత డిసెంబర్ 1 నుంచి 5 వరకూ జరిగింది. తొమ్మిదో విడత సమావేశాలు 2012 ఫిబ్రవరి 14 -మార్చి 29 వరకూ జరిగాయి. పదో విడత సెప్టెంబర్ 17 నుంచి 5రోజుల పాటు, పదకొండో విడత సమావే శాలు నవంబర్  30 నుంచి డిసెంబర్ 2 వరకూ జరిగాయి. 13వ సభ చివరి సమావేశాలు గత మార్చిలో ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి వర కూ కొనసాగాయి. ఇంత సుదీర్ఘ కాలం సభ ప్రొరోగ్ కాకుండా ఉండటం ఇదే తొలిసారి!

 

 వృథానే ఎక్కువ: 2013 జూన్ 21 నాటికి మొత్తం దాదాపు 584 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. అందులో 38.21 గంటల సమయం వృథా అయింది. దీనిలో 2.35 గంటలు కాంగ్రెస్, 22.19  గంటలు టీడీపీ, 28 నిమిషాలు పీఆర్‌పీ, 5.17 గంటలు టీఆర్‌ఎస్, 3.25 గంటలు ఎంఐఎం, 1.03 గంటలు సీపీఐ, 1.21 గంటలు బీజేపీ, 38 నిమిషాలు సీపీఎం, 1.02 గంటలు వైఎస్సార్‌సీపీ, 13 నిమిషాలు స్వతంత్రులు సభకు అంతరాయం కలిగిం చారు.

 

 లోక్‌సత్తా ఒక్క నిమిషం కూడా సభా కార్యక్రమాలకు అవాంతరం కలిగించలేదు. సభలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతలుగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖరరెడ్డి, కె. రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 28.23 గంటలు, టీడీఎల్పీ నేత నారా చంద్రబాబు నాయుడు 31.09 గంటలు, పీఆర్‌పీ పక్షనేత కొణిదెల చిరంజీవి 4.16 గంటలు,  టీఆర్‌ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ 7.11 గంటలు, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ 22.20 గంటలు, సీపీఐ పక్షనేత  గుండా మల్లేష్ 8.31 గంటలు, బీజేపీ పక్ష నేత లు జి.కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ 14.12 గంటలు, సీపీఎం పక్ష నేత జూలకంటి రంగారెడ్డి 18.39 గంటలు, లోక్‌సత్తా పక్ష నేత జయప్రకాష్ నారాయణ 23.36 గంటలు, వైఎస్సార్‌సీపీ పక్ష నేత వైఎస్ విజయమ్మ 54 నిమిషాలు ప్రసంగించారు. సభ కొలువు తీరిన 583.29 గంటల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులు 6.01 గంటలు,  కాంగ్రెస్ సభ్యులు 272.16 గంటలు, టీడీపీ సభ్యులు 137.47 గంటలు, పీఆర్‌పీ సభ్యులు 24.36 గంటలు, టీఆర్‌ఎస్ సభ్యులు 24 గంటలు, ఎంఐఎం సభ్యులు 30.09 గంటలు, సీపీఐ సభ్యులు 19.53 గంట లు, బీజేపీ సభ్యులు 20.04 గంటలు, సీపీఎం సభ్యుడు  21.07 గంటలు, లోక్‌సత్తా సభ్యుడు 23.32 గంటలు, స్వతంత్రులు 4.04 గంటలు ప్రసంగించారు. మొత్తం 102 బిల్లులను ఆమోదించారు.

 

 రెండు అవిశ్వాసాలు: ఈ శాసనసభ కాలంలోనే ప్రభుత్వంపై విపక్షాలు రెండుసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఇదే సభలో సభ్యులుగా ఉన్న 31 మంది సభ్యులు అనర్హతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి పదవులను త్యజించారు. సభలో 295 మంది (నామినేటెడ్‌తో కలిపి) సభ్యులు ఉండాలి. అయితే నిరవధికంగా వాయిదే పడే నాటికి 280 మంది మాత్రమే ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ప్రకటించటంతో 15 మంది అనర్హత వేటుకు గురయ్యారు.  

 

 201 రోజుల పాటు అసెంబ్లీ

 -    13వ శాసనసభ చివరి సమావేశాలు గత ఏడాది మార్చి 13 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకూ 48 రోజుల పాటు సమావేశమైంది. 115.46 గంటలు పనిచేసింది. ఈ సభలోనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ముఖ్యమంత్రితో సహా సుమారు వందమంది సభ్యులు దీనిపై ప్రసంగించారు.

 -    శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం విభజన బిల్లుపై అభిప్రాయం చెప్పకుండా దూరంగా ఉన్నారు.

 -    13వ సభ ఐదేళ్లలో 201 రోజుల పాటు కొలువుతీరింది.

 -    ఎమ్మెల్యేలు 12 విడతలుగా సమావేశమయ్యారు.  

 

 ప్రస్తుతం సభలో బలాబలాలు

 కాంగ్రెస్    146

 టీడీపీ    80

 టీఆర్‌ఎస్    17

 వైఎస్సార్‌సీపీ    17

 ఎంఐఎం    7

 సీపీఐ    4

 బీజేపీ    3

 సీపీఎం    1

 లోక్‌సత్తా    1

 స్వతంత్రులు    3

 నామినేటెడ్    1

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top