సత్యదేవుని ఆవిర్భావ వేడుకలకు అంకురార్పణ

129th Satyadeva Anniversary Celebrations In Annavaram Temple - Sakshi

సాక్షి, అన్నవరం (తూర్పుగోదావరి) : రత్నగిరివాసుడు శ్రీ సత్యదేవుని 129వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం వైభవంగా ప్రారంభించారు. ఉదయం 9.15 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పారాయణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 125 మంది రుత్విక్కులు, ఆలయ వైదిక సిబ్బందికి దీక్షావస్త్రాలను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్, ఈఓ ఎం.సురేష్‌ బాబు, ఏసీ డీఎల్‌వీ రమేష్‌బాబు అందజేశారు. సాయంత్రం దర్భారు మంటపంలో కలశ స్థాపన, మంటపారాధన చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్ర పుష్పాలతో సేవ చేశారు. దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠీ, ప్రధానార్చకుడు కొండవీటి సత్యనారాయణ, స్పెషల్‌ గ్రేడ్‌ వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వర శర్మ, ముత్య సత్యనారాయణ, ఛామర్తి కన్నబాబు, రవిశర్మ, అంగర సతీష్, పాలంకి పట్టాభి తదితరులు పూజాదికాలు నిర్వహించారు.

దేవస్థానం ఏసీ రమేష్‌బాబు, ఏఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు, నేడు ఆవిర్భావ వేడుక సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామి, అమ్మవార్ల మూలవిరాట్‌లకు మహాన్యాసపూర్వక అభిషేకం, పట్టువస్తాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎనిమిది గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం స్వామివారి విశేష పూజలు, హోమం నిర్వహిస్తారు. ఫల పుష్పసేవకు ఏర్పాట్లు రాత్రి 7.30 గంటలకు శ్రీ స్వామివారి నిత్యకల్యాణ మంటపంలో సత్యదేవుడు, అమ్మవార్లకు ఫల పుష్పసేవకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 20 రకాల ఫలాలు, 30 రకాల పుష్పాలతో మంటపాన్ని ముస్తాబు చేస్తున్నారు. తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌ అధినేత పోలిశెట్టి మల్లిబాబు అందజేసే మహాలడ్డూను స్వామివారికి నివేదన చేస్తారు.

తాపేశ్వరం లడ్డూ నేడు అన్నవరం తరలింపు తాపేశ్వరం (మండపేట): అన్నవరం సత్యదేవుని జన్మ దినోత్సవాల సందర్భంగా స్వామివారికి తాపేశ్వరంలోని మడత కాజా మాతృ సంస్థ సురుచి ఫుడ్స్‌ 500 కిలోల లడ్డూ తయారీ ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు అనంతరం గురువారం సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు లడ్డూ తయారీని ప్రారంభించారు. అర టన్ను బరువుతో ఈ లడ్డూ తయారీకి 220 కిలోల పంచదార, 130 కేజీల శనగపిండి, 110 కేజీల ఆవు నెయ్యి, 23 కేజీల జీడిపప్పు, ఆరు కేజీల బాదం పప్పు, రెండు కేజీల యాలికలు, అర కేజీ పచ్చకర్పూరం వినియోగి స్తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక వాహనంలో ఈ లడ్డూను అన్నవరం సత్యదేవుని సన్నిధికి తరలిస్తామని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top