కుంటుకుంటూ..


అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో 108 వాహనాల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ‘108’ వాహనాలు 37 ఉన్నాయి. మూడు వాహనాలు బాక్ అప్ కింద ఉన్నాయని అధికారులు చెబుతున్నా.. అది ఒట్టిమాటే. నిత్యం తిప్పే వాటిలోనే ఐదు వాహనాలు మూలనపడ్డాయి. అధిక సంఖ్యలో వాహనాలు కండీషన్‌లో లేవు. టైర్లు, ఇంజిన్ కండీషన్, లైట్లు సరిగా లేకపోవడంతో సిబ్బంది అవస్థల మధ్యే తిప్పుతున్నారు. ఉరవకొండ, యాడికి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కణేకల్లు ప్రాంతాల్లో సింగిల్ షిఫ్ట్(12 గంటలు) మాత్రమే వాహనాలు తిరుగుతున్నాయి. వాహనాల కండీషన్ సరిగా లేకపోవడమే ఇందుకు కారణం. కిరణ్ సర్కార్ నూతనంగా ఎనిమిది వాహనాలను అందించింది. వీటిలో అనంతపురానికి రెండు, గార్లదిన్నె, గోరంట్ల, హిందూపురం, ఆత్మకూరు, మరో రెండు ప్రాంతాలకు ఒక్కో వాహనం వాడుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని వాహనాలు గుజరీకి వెళ్లే విధంగా ఉన్నాయి.

 

 వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే

 ఆపదలో ఉన్న వారికి ఆస్పత్రిలో వైద్యం ఏవిధంగా అందిస్తారో అదేస్థాయి ప్రమాణాలతో 108లో వైద్య సదుపాయాలు ఉండాలి. ఆక్సిజన్, సెక్షన్ ఆపరేటర్, ఐవీ ఫ్లూయిడ్స్, 37 రకాల మందులు, ప్రథమ చికిత్సకు సంబంధించిన డిస్పెన్సరీ తదితర వాటితో కలుపుకుని 101 వైద్య సదుపాయాలు ఉండాలి. అయితే... ఆక్సిజన్ మినహా మిగిలిన వైద్య సదుపాయాలు లేవు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి అధిక సంఖ్యలో పాయిజన్ కేసులు వస్తుంటాయి. సెక్షన్ ఆపరేటర్ల వినియోగం ఎంతో అవసరం. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు.

 

 సిబ్బంది కొరత

 ప్రస్తుతం ‘108’లో  95 మంది డ్రైవర్లు, 90 మంది ఈఎంటీలు, ఇద్దరు ఈఎంఈలు, ఒక అసిస్టెంట్ ఫ్లీడర్ కలిపి మొత్తం 188 మంది పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. వాస్తవానికి 172 మంది మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో 13 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరితో పాటు మరికొంత మంది విధుల్లో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. సిబ్బంది కొరత ఉండడంతో వైద్య సేవలకు ఆటంకం కల్గుతోంది.

 

 వాహనం బాగు చేయించమంటే బదిలీ

 108 వాహనాల కండీషన్, అందులో వైద్య సదుపాయాలు సరిగా లేకున్నా సిబ్బంది సర్దుకుపోవాల్సి వస్తోంది. వాటి గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి సైతం జంకుతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే బదిలీ చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు సమాచారం. ఏ మారుమూల ప్రాంతానికో వెళ్లాలని ఆదేశిస్తుండడంతో సిబ్బంది అభద్రతా భావానికి గురవుతున్నారు.

 

 సమస్యలేమీ లేవు

 108 వాహనాలు బాగా తిరుగుతున్నాయి. రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చి.. ప్రాణాలను కాపాడుతున్నాయి. గతేడాది ఎనిమిది కొత్త వాహనాలొచ్చొయి. కండీషన్ లేని వాహనాలను వెనక్కి పంపుతున్నాం. సమస్యలు ఏమాత్రం లేవు.

 - రాజేంద్రప్రసాద్, రాయలసీమ ఇన్‌చార్జ్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top