బ్రేకులు ఫెయిలై.. ట్రాక్టర్‌ బోల్తా

One dead after tractor rollover accident - Sakshi

కూలీలను తీసుకొస్తుండగా ఘటన

ఒకరి మృతి..14 మందికి తీవ్ర గాయాలు..

గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమం..

గుండాల ఘాట్‌ రోడ్డులో ప్రమాదం..

దండేపల్లి(మంచిర్యాల)/తిర్యాణి(ఆసిఫాబాద్‌) : కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గుండాల ఘాట్‌రోడ్డులో వ్యవసాయ కూలీలను తీసుకువస్తున్న ట్రాక్టర్‌ గురువారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ఒకరు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి వివరాలు.. తిర్యాణి మండలం గుండాల పంచాయతీ పరిధిలోని అర్జుగూడ, పూనగూడ, రాజు గూడకు చెందిన 15మంది గిరిజన మహిళ కూలీ లు మంచిర్యాల జిల్లా దండేపల్లిలో వరినాట్లు వేసేందుకు ట్రాక్టర్‌లో బయలు దేరారు. ఘాట్‌రోడ్డు గుండా వస్తు న్న ట్రాక్టర్‌ వీరన్నఘాట్‌ మలుపు వద్ద చేరుకోగానే బ్రేకు లు ఫెయిల్‌ అయ్యి రోడ్డు పక్కన ఉన్న కందకంలో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కోట్నాక దేవుబాయి(40) అనే మహిళ తల పగిలి అక్కడిక్కడే మృతి చెందగా, కుమ్రం భారతిబాయి, పూలబాయి, విజయ, మర్సుకోల్ల వెన్నల, కోట్నాక నీల, ప్రేమలత, కోవ పార్వతి, లక్ష్మీబాయి, వనజ, జారుబాయి, జంగు బాయి, తొడసం కమలబాయి, మడావి శాంతబాయి, ఆత్రం ఉషారాణిలకు  తీవ్ర గాయలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలు దేవుబాయికి భర్త, ఇద్దరుకుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న దండేపల్లి ఎస్సై తోట సంజీవ్‌ ఊట్ల అటవీ ప్రాంతం నుంచి ఘాట్‌ రోడ్డు గుండా  ఘటన స్థలానికి ముందుగా చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా పోలీస్‌ అధికారులతో పాటు తిర్యాణి పోలీసులకు సమాచారం ఇచ్చారు.108అంబులెన్స్‌లు, ప్రైవేట్‌ వాహనాల ద్వారా క్షతగాత్రులను లక్సెట్టిపేట, మంచిర్యాల, కరీంనగర్‌ ఆసుపత్రులకు తరలించారు. తిర్యాణి ఎస్సై శ్రీనివాస్‌ ఘటన స్థలికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.  

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జేసీ..
మంచిర్యాల కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశాల మేరకు  ప్రమా ద స్థలాన్ని జేసీ సురేందర్‌రావు, ఆర్డీవో శ్రీనివాస్, దం డేపల్లి తహసీల్దార్‌ దత్తుప్రసాద్‌రావ్, ఆర్‌ఐ గణపతి, మంచిర్యాల ఏఎంవీఐ ప్రత్యూష పరిశీలించారు. విషయాన్ని కుమురంభీం జిల్లా అధికారులకు తెలియజేసి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు మృతురాలి కుటుంబానికి కూడా ప్రభుత్వపరంగా సాయం అందేలా చూస్తామన్నారు. అయితే మృతురాలి కుటుంబానికి ట్రాక్టర్‌ యజమానితో పరిహారం ఇప్పించాలని గిరిజనులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై పోలీసు అధికారులు చర్చిస్తున్నారు. క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top