
అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నా.. క్రమశిక్షణారాహిత్యం వల్ల అధఃపాతాళానికి పడిపోయిన క్రికెటర్ వినోద్ కాంబ్లీ (Vinod Kambli). శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబై బ్యాటర్ కెరీర్‌తో పాటు.. వ్యక్తిగత జీవితంలోనూ విఫలమయ్యాడు.
చెడు వ్యసనాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చావు అంచులదాకా వెళ్లాడు. ఇటీవలి వినోద్ కాంబ్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారగా.. 1983 వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులోని దిగ్గజాలు అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ సునిల్ గావస్కర్ కాంబ్లీకి ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నారు. తన ఫౌండేషన్ చాంప్స్ (CHAMPS) ద్వారా అతడికి ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధం చేశారు.
కాంబ్లీకి జీవితాంతం నెలకు..
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. గావస్కర్‌కు చెందిన ‘చాంప్స్’.. కాంబ్లీ బతికి ఉన్నంత కాలం నెల నెలా రూ. 30 వేల ఆర్థిక సాయం అందించనుంది. అంతేకాదు.. వైద్య అవసరాల నిమిత్తం ఏడాదికి మరో ముప్పై వేలు అదనంగా ఇవ్వనుంది.
కాగా కాంబ్లీ గురించి సునిల్ గావస్కర్ ఇండియా టుడేతో గతంలో మాట్లాడుతూ.. ‘‘1983 విన్నింగ్ జట్టు యువ ఆటగాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. వాళ్లు మాకు మనుమల లాంటి వాళ్లు. ఇంకొంత మంది వయసు దృష్ట్యా మాకు కుమారుల లాంటివారు.

మమకారం ఉండటం సహజం
అందుకే వారి పట్ల మాకు మమకారం ఉండటం సహజం. వారి పట్ల మా ప్రేమకు సాయం అనే పదం వాడటం సరికాదు. వినోద్ కాంబ్లీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది.
కష్టాల్లో ఉన్న క్రికెటర్లును చూసే నవ్వే రకం కాదు మేము. మాకు తోచిన రీతిలో వారికి సహాయపడటమే మా ముందున్న కర్తవ్యం’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తన వంతు సాయం అందించడం విశేషం.
కాగా ఈ ఏడాది ఆరంభంలో అస్వస్థతకు గురైన వినోద్ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని జనవరిలో డిశ్చార్జ్ అయ్యాడు. ఈ క్రమంలో 1983 విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కాంబ్లీని పరామర్శించాడు. ఇక గావస్కర్ సైతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు.
టీమిండియా తరఫున
ఇక సచిన్ టెండ్కులర్‌కు బాల్య మిత్రుడైన వినోద్ కాంబ్లీ.. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 17 టెస్టులు, 104 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) టీమిండియా తరఫున ఆడిన కాంబ్లీ.. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు చేశాడు.
అంతేకాదు.. టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు క్రికెటర్‌గా ఇప్పటికీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాంబ్లీకి భార్య ఆండ్రియా హెవిట్, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మద్యం, పొగ తాగటం చాన్నాళ్ల క్రితమే మానేశానంటూ కాంబ్లీ ఇటీవలే వెల్లడించాడు.
చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది