నాపై హత్యాయత్నం : బాల్క సుమన్‌ సంచలన వ్యాఖ్యలు

12 Sep, 2018 15:33 IST

సాక్షి, మంచిర్యాల : చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ, విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసి చంపాలనుకుంటున్నారని, తాను చస్తే చెన్నూర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే తాను చావడానికి కూడా సిద్ధమేనని ఆయన అన్నారు. ‘నా పైన దాడి చేసి నన్ను చంపాలి అనుకున్నారు. నేను చస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను చావడానికి సిద్ధం’  అని పేర్కొన్నారు.  జైపూర్‌ మండలం ఇందారంలో బుధవారం బాల్క సుమన్‌ ఓ కార్యక్రమం శంకుస్థాపన చేసేందుకు రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఓదెలు అనుచరులు ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బాల్క సమన్‌ మీడియాతో ఓదెలు వర్గం చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, టికెట్ ఇచ్చాక మొదటిసారి నియోజకవర్గంలో కాలుపెడితే తనపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు.

ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకే తాను చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీలోకి దిగుతున్నానని తెలిపారు. సీనియర్‌ నేత వివేక్  పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి వీలుగా.. ఆ టికెట్‌ ఇచ్చేసి.. చెన్నూర్ నియోజకవర్గం నుండి పోటీకి దిగాలని అధిష్టానం ఆదేశించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను వివేక్‌ను, ఆయన సోదరుడు వినోద్‌ను కలిసి సహకరించాలని కోరానని, అందుకు వారు సానుకులంగా స్పందించారని తెలిపారు. నల్లాల ఓదెలును కూడా హైదరాబాద్‌లో కలిసి సహకరించాల్సిందిగా కోరానని చెప్పారు. నిజమబాద్ నుండి జగ్దల్‌పూర్‌ రహదారికి నిధులు వచ్చేలా చేసి చెన్నూర్ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు.

నల్లాల ఓదేలు అనుచరుల ఆత్మహత్యాయత్నం
చెన్నూరు ఎమ్యెల్యే టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన నల్లాల ఓదేలుకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన అనచరులు ఆత్మహత్యాయత్నం చేశారు. జైపూర్‌ మండలం ఇందారంలో బుధవారం పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ పాల్గొన్న ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎంపీ రాకను తెలుసుకున్న ఓదేలు అనుచరులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ బాల్కసుమన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో ఘట్టయ్యా అనే కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకోని నిప్పంటించుకున్నాడు. అతని పక్కనే ఉన్న మరో నలుగురికి కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అక్కడున్నవారు వారి మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొని భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్‌ చేసి శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags