పెద్దసంఖ్యలో బదిలీలు

12 Sep, 2018 09:44 IST

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఒక వైపు ఎన్నికల మేఘాలు ముంచుకొస్తున్నాయి. అందుకు తగినట్లే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పనులు వేగవంతం చేసింది. ఈనెల 10న ఎన్నికల ముసాయిదా జాబితాను విడుదల చేయగా ఈనెల 25 వరకు అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. ఇక వచ్చే నెల 8న తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం హైదరాబాద్‌లో కలెక్టర్లతో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజిత్‌కుమార్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇదేక్రమంలో జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారుల వివరాలు పంపాలని, బదిలీ పరిధిలోకి వచ్చే అధికారుల వివరాలు అందజేయాలని సూచించారు.

దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికలతో ప్రత్యక్ష్యంగా సంబంధం ఉండే అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓల వివరాలు సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. తాజాగా సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కే.జోషి బదిలీలకు సంబంధించి సూచనలు చేశారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో స్థానచలనం కలిగిన అధికారులు వెంటనే విధుల్లో చేరకపోతే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాలో ఈఆర్వోలు, ఏఈఆర్వోల ఖాళీలు, భర్తీలపై కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌తో చర్చించారు.
 
పెద్దసంఖ్యలో బదిలీలు  
ఎన్నికల సమయంలో బదిలీలు సహజం. అయితే రాష్ట్రంలో జిల్లాల విభజన నేపధ్యంలో బదిలీలు, సర్వీస్‌ కాలం లెక్కింపులో ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుంటారా, కొత్త జిల్లాల 
ప్రాతిపదికన చూస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే విషయంలో జిల్లా అధికా రులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అక్కడినుంచి ఆదేశాలు రాగానే అమలు చేసేందు కు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. జోనల్‌ వ్యవస్థపై స్పష్టత వచ్చినందున కొత్త జిల్లాల ప్రాతిపదికన సర్వీస్‌ లెక్కిస్తారని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే ఖాయమైతే జిల్లాలోని 26 మం డలాల తహసీల్దార్లు, ఆర్డీఓ కార్యాలయం, డీఏఓ, కలెక్టరేట్‌లోని సెక్షన్‌ సూరింటెండెంట్లు కలిపి సుమారు 10 మంది తహసీల్దార్లు బదిలీ జాబితాలో ఉండే అవకాశమున్నట్లు సమాచారం.

అలాకాకుం డా ఉమ్మడి జిల్లా పరిధిని తీసుకుంటే సుమారు 35 మంది వరకు తహసీల్దార్లు స్థానచలనం తప్పకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అది కూడా కొత్త జోనల్‌ ప్రకారం మహబూబ్‌నగర్‌లోని అధికారులను జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, వికారాబాద్‌ జిల్లాలకు బదిలీ చేసే అవకాశాలు ఉంటాయి. పాత జోనల్‌ ప్రకారం బదిలీలు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది. కాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 34 తహసీల్దార్‌ పోస్టులకు గాను 33 మంది తహసీల్దార్లు విధుల్లో ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది.
  
ఎన్నికల తర్వాత.. 
గతంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎన్నికల అనంతరం తహసీల్దార్‌ స్థాయి అధికారులను ఎన్నికలు ముగిసిన నెలలో వారు గతంలో పనిచేసిన జిల్లాలకు తిరిగి పంపించేవారు. ప్రస్తుతం ఇదే ఆనవాయితీ కొనసాగితే ఇబ్బందిలేదు. ఒకవేళ ఎక్కడి వారక్కడే ఉండాల్సిందే అంటే మాత్రం ఎన్నికల బదిలీల్లో వెళ్లిన వారికి ఇబ్బందులు తప్పవు.  
ఎన్నికల బదిలీ నిబంధనలు

  • ఎన్నికల ప్రక్రియతో ప్రమేయం ఉన్న సొంత జిల్లా అధికారులను తప్పక బదిలీ చేయాలి. 
  • ఇతర జిల్లాల అధికారులు అయినప్పటికీ గత నాలుగేళ్లలో ప్రస్తుత జిల్లాలో మూడేళ్ల కాలం పూర్తయిన వాళ్లు బదిలీకి అర్హులు.  
  • పదోన్నతి పొంది పనిచేస్తున్నా.. గతంలో ఇక్కడే పనిచేసి ఉంటే మొత్తం సీనియారిటీని లెక్కిస్తారు.   
Tags