‘ఆర్టీసీ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది’

11 Sep, 2018 17:52 IST

సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షితో మాట్లాడుతూ.. ‘ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులు మాములుగా దొంగలమర్రి, నాచుపల్లి మీదుగా వెళ్లాలి. కానీ గత పది రోజులుగా బస్సులు కొండగట్టు ఘాట్‌ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం, బస్సు కండీషన్‌లో లేకపోవడం ప్రమాదానికి ఒక కారణం అయి ఉండొచ్చు. మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగింది. మేము ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇరవై మంది మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, ఆర్టీసీ తప్పిదం వల్లే జరిగింద’ ని తెలిపారు.

‘ఈ రూట్‌లో అసలు బస్సును నడపాల్సింది కాదు. దీనికి కారణమైన జగిత్యాల డిపో మేనేజర్‌, ఆర్టీసీ డీఎంపై చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుపై గతంలో లారీ ప్రమాదం జరిగిందని.. అయినా ఘాట్‌ రోడ్డు భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల’ని స్థానికులు కోరుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో 55మంది మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

Tags