అమ్మాయి విషయం : స్నేహితుణ్నే మట్టుబెట్టారు?

11 Sep, 2018 14:01 IST
సద్దాంహుసేన్‌ (ఫైల్‌)

కర్నూలు నంద్యాల: ఓ అమ్మాయి విషయంలో తోటి స్నేహితుడినే దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తగులబెట్టి, ఆ తర్వాత పూడ్చివేసినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల పట్టణానికి చెందిన ఖలీల్, సమీర కుమారుడు సద్దాంహుసేన్‌. ఇతను పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది జూలై 17న అదృశ్యమయ్యాడు. ఈ విషయంపై తల్లిదండ్రులు నంద్యాల టూటౌన్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. సద్దాంహుస్సేన్‌ను దారుణంగా హత్య చేశారన్న విషయం పోలీసు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. తోటి స్నేహితులే పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి తీసుకెళ్లి.. అక్కడే చంపి, పెట్రోల్‌ పోసి మృతదేహాన్ని తగులబెట్టిన అనంతరం పూడ్చి పెట్టినట్లు సమాచారం. ఓ అమ్మాయి కోసమే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయంపై టూటౌన్‌ సీఐ రామకృష్ణారెడ్డిని అడగ్గా.. పాణ్యం మండలం పిన్నాపురంలో కొంత మంది కలిసి హత్య చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి తహసీల్దార్, విద్యార్థి తల్లిదండ్రులను తీసుకొని వెళతామని చెప్పారు. మృతదేహాన్ని చూసిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి, పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడిస్తామన్నారు.   

Tags