భర్త, పిల్లలతో నిద్రిస్తున్న మహిళపై...

11 Sep, 2018 11:56 IST
అన్వర్‌బాషా, కౌన్సిలర్‌

టీడీపీ కౌన్సిలర్‌ కీచక అవతారమెత్తాడు. భర్త, పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కౌన్సిలర్‌పై నిర్భయ, లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

అనంతపురం, గుంతకల్లు టౌన్‌: గుంతకల్లు మునిసిపాలిటీలోని ఓ కాలనీలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఇళ్లల్లో పాచిపనులు చేసుకుంటూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఆదివారం అర్ధరాత్రి భర్త, పిల్లలతో కలిసి ఆమె గాఢనిద్రలో ఉంది. టీడీపీకి చెందిన ఆ వార్డు కౌన్సిలర్‌ అన్వర్‌బాషా ఆమె ఇంట్లోకి చొరబడి.. ఆమెను నిద్రలేపాడు. ‘ఎందుకొచ్చావ్‌.. ఇప్పుడేం పని’ అంటూ ఆమె నిలదీయడంతో కౌన్సిలర్‌ తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. భర్త నిద్రలేచే సరికి కౌన్సిలర్‌ అక్కడి నుంచి పరుగు లంకించాడు.

కేసు నమోదు
సోమవారం ఉదయం బాధితురాలు తన భర్త, బంధువులతో కలిసి ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కౌన్సిలర్‌ అన్వర్‌బాషాపై 354, 448 సెక్షన్ల కింద (నిర్భయ, లైంగిక వేధింపులు, ఇంట్లోకి అక్రమ చొరబాటు)కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యు.వెంకటప్రసాద్‌ తెలిపారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం మెయిన్‌రోడ్డులో ఓ యువతి పట్ల కూడా కౌన్సిలర్‌ అన్వర్‌ వెకిలిచేష్టలకు పాల్పడితే.. పోలీసులు వార్నింగ్‌ ఇచ్చినట్లు తెలిసింది.  

లైంగిక వేధింపులకు పాల్పడలేదు
ఆదివారం రాత్రి భోజనం చేశాక నేను వాకింగ్‌కు బయటకు వచ్చాను. ఆ సమయంలో ఆ మహిళ ఇంటి తలుపు తెరిచి ఉండటం గమనించాను. ఇటీవల చోరీలు అధికంగా జరుగుతుండటంతో ఆమెను నిద్రలేపి తలుపు వేసుకోవాలని చెప్పాను. అంతే తప్ప నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదు. – అన్వర్‌బాషా, కౌన్సిలర్‌

Tags