జగ్గారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు

11 Sep, 2018 09:46 IST

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి మానవ అక్రమ రవాణా చేశారని వస్తున్న అభియోగాల్లో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి ఆయనను టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం గాంధీ ఆసపత్రిలో జగ్గారెడ్డికి వైద్యపరీక్షలు నిర్వహించారు.. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టించిందని ఆరోపించారు. 

సంగారెడ్డిలో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన బహిరంగ సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నానని.. సభ ఫెయిల్‌ కావాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు దిగారని మండిపడ్డారు. తాను ఎవరిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లలేదని, రాజకీయంగా దెబ్బతీసేందుకే ఎన్నికల సమయంలో తప్పుడు కేసుల పెట్టారని వివరించారు. 2004 నుంచి లేని తొందర ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తనను అరెస్ట్‌ చేయడంతో అందరికీ అర్థమైందన్నారు . తెలంగాణ ఆపద్దర్మ సీఎం కేసీఆర్‌, ఆపద్దర్మ మంత్రి హరీష్‌ రావులపై కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ కేసులో ఉన్నారని వారిని కూడా అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  

జగ్గారెడ్డిపై 8 సెక్షన్ల కింద కేసులు...
2004లో నకిలీ పత్రాలు, పాస్‌పోర్ట్‌తో మానవ అక్రమ రవాణా చేసిన కేసులో అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ కార్యాలయంలో 3 గంటలు పాటు జగ్గారెడ్డిని విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ కి చెందిన ముగ్గురిని తన కుటుంబ సభ్యులుగా మార్చి అమెరికాకి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిపై ఐపీసీ 419, 490, 467, 468, 471, 370, పాస్ పోర్ట్ యాక్ట్ సెక్షన్ 12, ఇమ్మిగ్రేషన్ యాక్ట్ 24 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. 
 

నేడు సంగారెడ్డి బంద్‌
కాంగ్రెస్‌ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఆయన అరెస్ట్‌కు నిరసనగా నేడు(మంగళవారం) బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. జగ్గారెడ్డిని అరాచకంగా అరెస్ట్‌ చేశారని డీజీపీకి వినతి పత్రం అందజేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తదితర కాంగ్రెస్‌ నేతలు.
 

చదవండి: జగ్గారెడ్డి అరెస్ట్‌

Tags