చుట్టేసే ట్యాబ్లెట్‌ ఇది...

11 Sep, 2018 05:12 IST

ఫొటో చూస్తే విషయం అర్థమైపోతుంది. కెనెడాలోని క్వీన్స్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ట్యాబ్లెట్‌ ఇది. స్క్రీన్‌ను ఉండలా చుట్టేయగలగడం దీని ప్రత్యేకత. డాక్టర్‌ రోల్‌ వెర్టిగాల్‌ నేతృత్వంలోని బృందం ఈ నమూనా యంత్రాన్ని తయారు చేసింది. వివరాలు  చూస్తే.. ఏడున్నర అంగుళాల వెడల్పు ఉండే ఈ ట్యాబ్లెట్‌ స్క్రీన్‌పై చిత్రాలు 2కే రెజల్యూషన్‌లో కనిపిస్తాయి. త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో తయారుచేసిన గొట్టం లాంటి ఆకారంపై ఈ తెరను చుట్టేయవచ్చు. గొట్టానికి రెండు చివరల చక్రాల్లాంటివి ఉంటాయి.

వాటిని అటు ఇటు తిప్పితే స్క్రీన్‌పై ఉండే ఫొటోలు, వీడియోలు, సమాచారం కనిపిస్తుందన్నమాట. ఈ చక్రాలకు ఒకవైపు ఉండే కెమెరాలను వాడుకుంటే సంజ్ఞల ద్వారా కూడా ట్యాబ్లెట్‌ను పనిచేయించవచ్చు. మొబైల్‌ఫోన్, వాయిస్‌ రికార్డర్‌గానూ దీన్ని ఉపయోగించుకోవచ్చునని, అవసరం లేనప్పుడు ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చునని వెర్టిగాల్‌ తెలిపారు. ఈ వినూత్నమైన ట్యాబ్లెట్‌ వివరాలను ఈ వారం స్పెయిన్‌లో జరగబోయే మొబైల్‌ హెచ్‌సీఐలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు.  

Tags