‘మణికర్ణిక’కు మరో షాక్‌..!

11 Sep, 2018 02:12 IST

క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా వివాదాలు మాత్రం ఎక్కువవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్‌ పనులతో బిజీగా ఉండటంతో దర్శకుడు క్రిష్ మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు.

దీంతో ఆ బాధ్యతను హీరోయిన్‌ కంగనా రనౌత్ తీసుకున్నారు. అప్పటి నుంచే అసలు వివాదం మొదలైంది. సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారు. అయితే కంగనా రనౌత్‌ దర్శకత్వంలో నటించటం ఇష్టం లేకే సోనూసూద్ తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంజయ్‌ కుట్టి కూడా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్‌ అనుకున్న దానికంటే భారీగా పెరిగిపోవటంతో సంజయ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట.

Tags