‘వ్యక్తిగత చనువుతోనే ఆయనతో రాజకీయాలు మాట్లాడాను’

10 Sep, 2018 16:34 IST

సాక్షి, అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ హోంమంత్రి, వైఎస్సార్‌సీపీ నేత వసంత నాగేశ్వరరావు విమర్శించారు. వ్యక్తిగత పరిచయంతోనే గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావుతో రాజకీయాలు మాట్లాడానని, అంతే కానీ ఎటువంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు. అధికార బలంతో బెదిరించి గుంటుపల్లి ఈఓ చేత నాపై ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శి నర్సింహారావు మా సొంత గ్రామంలో పనిచేశారు. ఆయనతో నాకు చాలా చనువు ఉంది. గుంటుపల్లిలో వైఎస్సార్‌సీపీ బ్యానర్లను, జెండాలను ఏకపక్షంగా తొలగిస్తున్నారని గ్రామస్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో ఈఓ నర్సింహారావు అక్కడే ఉన్నట్లు తెలియడంతో ఆయనకు ఫోన్‌ చేశా. పాత పరిచయం ఉండటంతో రాజకీయాలు మాట్లాడాను. అదే చనువుతో ఆయన కుటుంబం, పిల్లల గురించి అడిగాను. దానిని ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? నోను ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు కాల్‌ రికార్డింగ్‌ను వక్రీకరించారు. నా అనుమతి లేకుండా కాల్‌ రికార్డు చేయడం ఎంత వరకు సమంజసం‘ అని వసంత నాగేశ్వరరావు ప్రశ్నించారు. 

మైలవరం నియోజక వర్గంలో వైఎస్సార్‌సీపీకి వస్తున్న ప్రజామద్దతు దేవినేని తట్టుకోలేకనే ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జెండాలు తీయించడం, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని మండి పడ్డారు. మంత్రి దేవినేని అవినీతిని తన కుమారుడు కృష్ణ ప్రసాద్‌ ప్రజల్లో ఎండగడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

మైలవరం నియోజకవర్గంలో బ్యానర్ల విషయంపై మాట్లాడటానికి ఫోన్ చేసిన నాగేశ్వరరావు, ఈవోని బెదిరించాడని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నాగేశ్వరరావుపై కేసు కూడా పెట్టారు.

Tags