కారు దిగిపోతారా?

10 Sep, 2018 06:50 IST
సత్తుపల్లి మట్టా దయానంద్‌ మధిర బొమ్మెర రామ్మూర్తి వైరాలో వేరే వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలంటున్న బొర్రా రాజశేఖర్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  ఇటీవలే అధికార పార్టీ తరఫున శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో..కొన్ని చోట్ల వీరి అభ్యర్థిత్వం పట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సత్తుపల్లి, వైరా, మధిరకు చెందిన నేతలు పార్టీ టికెట్‌లో అన్యాయం జరిగిందంటూ అసమ్మతి గళాలను వినిపించేందుకు  సిద్ధమవుతున్నారు. తమ నియోజకవర్గ అభ్యర్థిని మార్చకపోతే తాడోపేడో తేల్చుకుంటామంటూ వైరా నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీలోని అసమ్మతి నేతలు మండల స్థాయిలో సమావేశం నిర్వహిస్తుండడంతో పార్టీలో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్‌ ఆశించిన ఆశావహులతో పాటు అభ్యర్థులుగా ఖరారు అయిన వారిపై గల వ్యతిరేకత అసమ్మతిసెగలు రాజుకోవడానికి దారితీస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఐదు శాసనసభా స్థానాలకు ఈ నెల 6వ తేదీన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు.

ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, వైరా శాసనసభ్యులు మదన్‌లాల్‌లతో పాటు సత్తుపల్లికి పిడమర్తి రవి, మధిరకు లింగాల కమల్‌రాజ్‌లను కేసీఆర్‌ ప్రకటించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తూ, పార్టీ జెండా మోసిన తమకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని కార్యకర్తల మనోభిప్రాయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని..టికెట్‌ ఆశించి భంగపడిన పలవురు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ,  కార్యకర్తలను సమీకరిస్తూ తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిత్వాలు ఖరారు అయినా.. పార్టీ మరోసారి పునరాలోచన చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మధిర: బొమ్మెర రామ్మూర్తి  
ఇక మధిర నియోజకవర్గంలోనూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బొమ్మెర రామ్మూర్తి మరోసారి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే ఆయనకు కాకుండా టీఆర్‌ఎస్‌ నేత లింగాల కమల్‌రాజ్‌కు పార్టీ అధినేత కేసీఆర్‌ సీటు కేటాయించడంతో బొమ్మెర రామ్మూర్తి వర్గీయులు ఆవేదనకు గురయ్యారు. తమకు పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుంది, తమ భవిష్యత్‌పై ఏరకమైన భరోసా ఇస్తుందో తేల్చుకునేందుకు రామ్మూర్తి సమాయత్తమవుతున్నారు. పార్టీ నుంచి వెలువడే సంకేతాల ఆధారంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన భావిస్తున్నారు.

ఇక ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిపై పార్టీ నేతలు దృష్టి సారించారు. వారితో మాట్లాడేందుకు, అలాగే అవసరమైతే వారి ఇళ్లకు వెళ్లి బుజ్జగించేందుకు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో పని చేసి పార్టీకి ఆది నుంచి అండగా ఉంటూ వస్తున్న నేతలను అక్కున చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
  
సత్తుపల్లి: మట్టా దయానంద్‌ 
ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వాన్ని ఆశించిన పార్టీ నేత డాక్టర్‌ మట్టా దయానంద్‌ టికెట్‌ రాకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరాశ, నిస్పృ హలకు గురయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కన్నా నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను పార్టీకి వివరించడం ద్వారా ఒత్తిడి పెంచబోతున్నారు. వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తనకు టికెట్‌ రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకునే పనిలోపడ్డారు. ఈ నెల 11వ తేదీన సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల అభిప్రాయం అనుగుణంగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.
 
వైరా:  టీఆర్‌ఎస్‌ పార్టీలో అసమ్మతి ప్రకంపనలు పెరుగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాణోత్‌ మదన్‌లాల్‌కు అధిష్టానం టికెట్‌ ఖరారు చేయడంతో ఆయనను వ్యతిరేకిస్తున్న బలమైన వర్గం నియోజకవర్గ స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ పట్టుబడుతోంది. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు అనుకూల వాతావరణం ఉందని, అందరినీ కలుపుకుపోయే అభ్యర్థికి టికెట్‌ ఇస్తే గెలుపు ఖాయం..అంటూ మదన్‌లాల్‌పై కార్యకర్తల అభిప్రాయాలు క్రోడీకరించి అధిష్టానానికి తెలియజేసేందుకు ఆ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించింది. ప్రతి మండలంలో సమావేశం నిర్వహించేందుకు అసమ్మతివర్గం సమాయత్తమవుతోంది.
 
అధిష్టానం ఆలోచించాలి..  
వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారుపై నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంటుంది. పార్టీ నేతలందరినీ కలుపుకపోయే వ్యక్తికి టికెట్‌ లభిస్తే ఇక్కడ విజయం సాధించడం ఖాయం. పార్టీ విధానాలకన్నా వ్యక్తిగత ఎజెండాకు ప్రాధాన్యమిచ్చే వారిని భుజాన మోసేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సిద్ధంగా లేరని, పార్టీ పెద్దలకు, అధిష్టానానికి చెప్పేందుకు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ప్రతి మండలంలో సమావేశం నిర్వహించడం ద్వారా అక్కడ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.

నియోజకవర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు, అనేక మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ అభ్యర్థిత్వాన్ని పునర్‌పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ను కార్యకర్తలతో సహా కలిసేందుకు సిద్ధమవుతున్నాం. కార్యకర్తలకు పార్టీ భరోసా కల్పించి, ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేసే విధంగా అభ్యర్థిని ఖరారు చేయాలని, నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అనేక మంది కోరుకుంటున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం. అధిష్టానానికి ఇక్కడ పరిస్థితులు కులంకుశంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నాం.  –బొర్రా రాజశేఖర్, వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేత  

అధినేతను కలిశాకే కార్యాచరణ.. 
టీఆర్‌ఎస్‌ పార్టీలో తనకు అండ..దండగా ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కలిశాకే కార్యాచరణను ప్రకటిస్తా. నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాల పాటు పార్టీ జెండాను భుజాన మోసిన తనకు ఏ రకంగా న్యాయం చేయాలో పార్టీ పరిశీలిస్తుందని విశ్వసిస్తున్నా. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ తనను కలవాల్సిందిగా కబురు చేశారు. నియోజకవర్గ పరిస్థితి, పరిణామాలు, తన రాజకీయ భవిష్యత్‌పై ఆయనతో చర్చించి, సీఎం కేసీఆర్‌ను కలిసి నిర్ణయం తీసుకుంటా.  –బొమ్మెర రామ్మూర్తి, మధిర అసమ్మతి నేత

Tags