మోదీతో పోటీపడి సుంకం పెంచిన బాబు

10 Sep, 2018 03:54 IST
రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేస్తున్న అంబటి

సత్తెనపల్లి: పెట్రోలు, డీజిల్‌ ధరలను ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ పెంచుతూ ఉంటే, ఆయనతో పోటీపడి ముఖ్యమంత్రి చంద్రబాబు సుంకం పెంచుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలకు నిరసనగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘నా రక్తం నా రిక్షకు పెట్రోలు’ అంటూ రిక్షా తొక్కి అంబటి రాంబాబు నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విపరీతంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అత్యధికంగా పెట్రోలు డీజిల్‌ ధరలు ఉన్నాయన్నారు. తమిళనాడులో లీటరుకు రూ.4 తక్కువగా ఉందని.. కర్ణాటక, ఒడిశా, తెలంగాణలోనూ పెట్రోలు, డీజిల్‌ ధరలు తక్కువగా ఉన్నాయన్నారు.

ఒకవైపు మోదీ పెట్రో ధరలు పెంచుతూ ఉంటే, సీఎం చంద్రబాబు ఆయనతో పోటీపడి సుంకం పెంచడంవల్లే ఇతర రాష్ట్రాలకంటే ఇక్కడ ధరలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. పెట్రో సుంకాలు పెంచుతూ చంద్రబాబు బంద్‌కు మద్దతు ఎలా ఇస్తారో అర్థంకావడంలేదన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా రాష్ట్రంలోనూ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించిన రోజునే చంద్రబాబు పాపం లేదనుకుంటామని అంబటి అన్నారు. మోసం కాగా, సత్తెనపల్లిలోని అమరావతి బస్టాప్‌ సెంటర్‌ నుంచి గడియార స్తంభం వరకు, అక్కడి నుంచి తాలూకా వరకు పార్టీ నేతలు రిక్షాలు తొక్కి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రగతి విద్యా సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్‌ మక్కెన అచ్చయ్య, నేతలు ఆకుల శివయ్య, షేక్‌ నాగూర్‌మీరాన్, చల్లంచర్ల సాంబశివరావు, ఆతుకూరి నాగేశ్వరరావు, సయ్యద్‌ మహబూబ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags