ముహూర్తం 12న?: కొండా దంపతులు

9 Sep, 2018 13:03 IST
కొండా సురేఖ దంపతులు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకతను కలిగి ఉన్న  కొండా సురేఖ దంపతులు తిరిగి సొంత గూటికి వెళ్లనున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వరంగల్‌ తూర్పు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి మరోసారి టికెట్‌ ఆశిం చిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖకు టికెట్‌ రాకపోవడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. టీఆర్‌ఎస్‌ నుంచి తమకు టికెట్‌ వచ్చే పరిస్థితి లేకపోవడంతో శనివారం హైదరాబాద్‌లో కొండా దంపతులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి సర్వే రిపోర్ట్‌ను, ప్రకటించిన 105 మందికి బీఫామ్‌లు ఇవ్వాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మంత్రివర్గంలో తమకు కావాలనే చోటు కల్పించలేదని ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు బట్టిచూస్తే పార్టీ మార డం ఖాయంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విలేకరులు ఏ పార్టీలో చేరబోతున్నారు అని అడిగిన ప్రశ్నకు సైతం వారు సమాధానమివ్వలేదు.  రెండు రోజుల్లో కేసీఆర్‌ సమాధానం  చెప్పకపోతే బహిరంగ లేఖ రాసి ఏ పార్టీలో చేరతామో మళ్లీ విలేకర్ల సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ అధిష్టానంతో..
టీఆర్‌ఎస్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన కొండా దంపతులు అంతకు ముందే కాంగ్రెస్‌ అధిష్టానంతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 12న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధినాయకత్వంతో కూడా వారు చర్చలు జరిపినట్లు సమాచారం. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖకు , పరకాల నుంచి సుస్మిత పటేల్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు పీసీసీ నేతలు కూడా ఓకే  చెప్పినట్లు సమాచారం. కొండా దంపతుల అనుచరులు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని  పలు నియోజకవర్గాల్లో సైతం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌కు బలం చేకూరుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు భావిస్తున్నట్లు తెలిసింది.

Tags