మూడు నెలల క్రితమే ప్రేమపెళ్లి..

9 Sep, 2018 08:20 IST
వివరాలు తెలుసుకుంటున్న మంత్రి జోగు రామన్న, అంకిత(ఫైల్‌)

జైనథ్‌(ఆదిలాబాద్‌): కట్నం వేధింపులు తాళలేక జైనథ్‌ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన ఆవుల అంకిత(25) పెన్‌గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దీపాయిగూడలోని లోక రవీందర్‌ రెడ్డి, అనురాధల కుమార్తె అంకిత, అదే గ్రామానికి చెందిన సాయి నాలుగు నెలల క్రితం ప్రేమవివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు. ఆదిలాబాద్‌లో కాపురం పెట్టారు. కాగా సాయి తనకు రూ.3లక్షల కట్నం ఇవ్వాలని తరుచూ భార్య అంకితను వేధించేవాడు. అంకిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి, కట్నం ఇస్తేనే కూతురితో కాపురం చేస్తానని, లేదంటే తీసుకెళ్లాలని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం ఇద్దరు కలిసి ఆదిలాబాద్‌ నుంచి భోరజ్‌ గ్రామానికి వచ్చారు.

అక్కడి నుంచి సాయి దీపాయిగూడకు వెళ్లగా, అంకిత మహారాష్ట్రలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి పిప్పల్‌కోటికి బయలు దేరింది. మార్గమధ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు బ్రిడ్జిపై నుంచి పెన్‌గంగ నదిలో దూకింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకుండాపోయింది. శనివారం ఉదయం మండలంలోని ఆనంద్‌పూర్‌ సమీపంలో బ్రిడ్జికి కూతవేటు దూరంలో మృతదేహం కనిపించగా జాలర్లు ఒడ్డుకు చేర్చి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్సై తోట తిరుపతి శవాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఆపధర్మ మంత్రి జోగు రామన్న, డీఎస్పీ నర్సింహా రెడ్డి, తహసీల్దార్‌ బొల్లెం ప్రభాకర్‌ మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబీకులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. దీపాయిగూడలో అంత్యక్రియలు నిర్వహించగా  మంత్రి జోగు రామన్న పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

నిండు జీవితాలు బలి
వాస్తవంగా అంకిత, సాయి ఇద్దరిదీ రెండో వివాహమే. నాలుగు సంవత్సరాల క్రితం అంకితను జైనథ్‌ మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం చేశారు. ఆవుల సాయికి అదే గ్రామానికి చెందిన యువతిని ఇచ్చి పెళ్లి చేశారు. వీరి ఇద్దరు కూడా పెళ్లి జీవితాల్లో ఇమడలేకపోయారు. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్లు అయినా వీరి మధ్య సంబంధం కొనసాగడంతో పాత జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చేశారు.

అనంతరం పెద్దలను ఎదిరించి ఇద్దరు ప్రేమవివాహం చేసుకున్నారు. కాగా వీరి పెళ్లి జీవితం ఎంతో కాలం నిలవలేదు. కట్నం కోసం సాయి, అంకితను వేధించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. మొదటి పెళ్లి కాదని, పెద్దలను ఎదిరించి రెండో వివాహం చేసుకోవడంతో ఇరు కుటుంబాలకు దూరమయ్యారు. భర్త వేధింపులు అధికమవడంతో అంకిత తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కాగా మృతురాలి తండ్రి రవీందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు సాయిపై 498(ఏ), 304(బి) సెక్షన్ల కింద వరకట్నం వేధింపులు, గృహహింస కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags