పారద గణపతి

9 Sep, 2018 01:44 IST

పాదరసంతో తయారుచేసిన గణపతినే ‘పారద గణపతి’ అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు చేసిన గణపతిని అర్చించడం కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. జ్ఞానవృద్ధి,  మనోస్థైర్యాల కోసం పారద గణపతి ఆరాధన చక్కని సులభమార్గం. వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది.

వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పారద గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా తయారు చేయించిన పారద లక్ష్మీగణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇక్కట్లు, ఆటంకాలు తొలగిపోతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పారద లక్ష్మీగణపతిని పూజించడం వల్ల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారద గణపతిని లేదా పారద లక్ష్మీగణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి.

– పన్యాల జగన్నాథ దాసు

Tags