పట్టు చేజారినట్టే! 

9 Sep, 2018 01:20 IST

బౌలింగ్‌లో ఇంగ్లండ్‌ లోయర్‌ ఆర్డర్‌ను కట్టడి చేయలేకపోయిన టీమిండియా... బ్యాటింగ్‌ వైఫల్యంతో చివరి టెస్టులోనూ కష్టాల్లో పడింది. ఆతిథ్య జట్టు పేసర్ల పదునైన బంతులు మన బ్యాట్స్‌మెన్‌ను చుట్టు చుట్టేశాయి. ఎప్పటిలాగే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి యోధుడిలా పోరాడినా మిగతావారు యథాప్రకారం నిష్క్రమించారు. ప్రత్యర్థి చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ జోడించిన పరుగులే ఇరు జట్ల మధ్య తేడా చూపనున్నాయి. అరంగేట్ర హనుమ విహారి మూడో రోజు ఏమేరకు పోరాడతాడో... అంతరం ఎంతవరకు తగ్గిస్తాడో చూడాలి.  

లండన్‌: సుదీర్ఘ పర్యటనను గౌరవప్రదంగా ముగించాలనుకుంటే టీమిండియా శక్తికి మించి పోరాడక తప్పేలా లేదు. చివరిదైన ఐదో టెస్టులో శనివారం రెండో రోజు ఆట పూర్తయ్యాక పరిస్థితి చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్‌ కోహ్లి (70 బంతుల్లో 49; 6 ఫోర్లు), ఓపెనర్‌  రాహుల్‌ (53 బంతుల్లో 37; 4 ఫోర్లు), పుజారా (101 బంతుల్లో 37; 5 ఫోర్లు) భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. కొత్త కుర్రాడు హనుమ విహారి (25 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆల్‌రౌండర్‌ జడేజా (8 బ్యాటింగ్‌) పోరాడుతున్నారు. స్వింగ్‌తో చెలరేగిన అండర్సన్‌ (2/20) కీలక వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్‌ (2/44) తనవంతుగా ఓ చేయి వేశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 198/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 332 పరుగులకు ఆలౌటైంది. ‘బర్త్‌ డే బాయ్‌’ జాస్‌ బట్లర్‌ (133 బంతుల్లో 89; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫటాఫట్‌ ఇన్నింగ్స్‌తో జట్టుకు మంచి స్కోరు అందించాడు. భారత బౌలర్లలో జడేజా (4/79)కు నాలుగు వికెట్లు దక్కాయి. 

మళ్లీ తోక జాడించారు... 
సిరీస్‌ మొదటి నుంచి టీమిండియాను వేధిస్తున్న ఇంగ్లండ్‌ లోయర్‌ ఆర్డర్‌ ఈసారీ అదే పని చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌లో ఆదిల్‌ రషీద్‌ (15) తొందరగానే ఔటైనా... బ్రాడ్‌ (38; 3 ఫోర్లు) తోడుగా బట్లర్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. దీంతో లంచ్‌కు ముందే జట్టు స్కోరు 300 దాటింది. శుక్రవారం రోజంతా ఆడి 198 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌ శనివారం తొలి సెషన్‌లోనే 107 పరుగులు చేయడం గమనార్హం. లంచ్‌ తర్వాత మూడో ఓవర్‌లోనే బ్రాడ్‌ ఆట ముగిసింది. జడేజా బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన అతడు రాహుల్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. దీంతో 9వ వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అండర్సన్‌ (0 నాటౌట్‌)ను అవతలి ఎండ్‌లో ఉంచి ఎక్కువగా స్ట్రయికింగ్‌ తీసుకున్న బట్లర్‌... బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదాడు. అదే ఊపులో జడేజా వేసిన బంతిని షాట్‌ కొట్టబోయి స్లిప్‌లో రహానేకు చిక్కాడు. చివరి మూడు వికెట్లకు 151 పరుగులు జతకూరడంతో ఇంగ్లండ్‌కు మోస్తరు స్కోరు సమకూరింది.  

ధావన్‌ మళ్లీ... ప్చ్‌! 
భారత్‌ ఇన్నింగ్స్‌ను మరోసారి ఓపెనింగ్‌ వైఫల్యం వెంటాడింది. రెండో ఓవర్‌ మొదటి బంతికే ధావన్‌ (3) బ్రాడ్‌కు వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. అయితే, రాహుల్‌ సానుకూలంగా కని పించాడు.దూకుడుగా షాట్లు కొట్టాడు. సరిగ్గా టీ విరామానికి ముందటి ఓవర్లో టీమిండియా స్కోరు 50 దాటింది. బ్రేక్‌ తర్వాత కూడా పరుగులు సులభంగా వస్తున్న స్థితిలో కరన్‌ దెబ్బకొట్టాడు. తక్కువ వేగంతో అతడు వేసిన బంతి రాహుల్‌ను బోల్తా కొట్టిస్తూ వికెట్లకు తగిలింది. రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పుజారా, కోహ్లి కొద్దిసేపు సాధికారికంగా ఆడారు. అండర్సన్‌ రివర్స్‌ స్వింగ్‌తో కోహ్లిని ఇబ్బందిపెట్టాడు. ఓసారి వికెట్ల ముందు దొరికినా అంపైర్‌ ఎల్బీగా ప్రకటించలేదు. కానీ, తర్వాతి ఓవర్లోనే అండర్సన్‌ పుజారా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అనూహ్యంగా వచ్చిన ఇన్‌ స్వింగర్‌ పుజారా బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. వైస్‌ కెప్టెన్‌ రహానే (0) ఇలా వచ్చి అలా వెళ్లాడు. భారత్‌ 103 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో కోహ్లికి విహారి జత కలిశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అర్ధ శతకం దిశగా సాగుతున్న సమయంలో స్టోక్స్‌ బంతిని డ్రైవ్‌ చేయబోయి స్లిప్‌లో రూట్‌కు కోహ్లి క్యాచ్‌ ఇచ్చాడు. పంత్‌ (5) ప్రతిఘటన లేకుండానే లొంగిపోయాడు.  

విహారి... ఉత్కంఠను తట్టుకుని 
ఆంధ్ర బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి తీవ్ర ఉత్కంఠను తట్టుకుని నిలిచాడు. బ్రాడ్‌ పదునైన బంతికి అతడు వికెట్ల ముందు దొరికినా అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. ఇంగ్లండ్‌ కూడా రివ్యూ కోరలేదు.  రెండోసారీ ఇలాంటి సందర్భమే ఎదురవగా సమీక్షలో బంతి వికెట్లకు దూరంగా వెళ్తున్నట్లు తేలింది. దీంతోపాటు మరికొన్ని క్లిష్టమైన బంతులు విహారికి పరీక్ష పెట్టాయి. వాటన్నిటిని ఎదుర్కొన్న అతడు కోహ్లికి అండగా నిలిచాడు.ఆత్మవిశ్వాసం కూడగట్టుకున్నాక బ్యాట్‌ ఝళిపించాడు. స్టోక్స్‌ వేసిన షార్ట్‌ లెగ్‌ బంతిని వికెట్ల వెనుకకు సిక్స్‌గా పంపాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇదే ఏకైక సిక్స్‌ కావడం విశేషం. అనంతరం సైతం చక్కటి షాట్లు కొట్టాడు. 

►1 టెస్టుల్లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్‌ (106) గుర్తింపు పొందాడు. ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక–105 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును ఈ ఇంగ్లండ్‌ బౌలర్‌ సవరించాడు.
 
 ► 59 ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత పేసర్లు (ఇషాంత్‌ 18, షమీ 14, బుమ్రా 14, హార్దిక్‌ పాండ్యా 10, ఉమేశ్‌ 3) తీసిన వికెట్లు. గతంలో పాక్‌తో జరిగిన 1979–80 సిరీస్‌లో భారత పేస్‌ బౌలర్లు (కపిల్‌దేవ్‌ 32, కర్సన్‌ ఘావ్రి 15, రోజర్‌ బిన్నీ 11) అత్యధికంగా 58 వికెట్లు పడగొట్టారు.   

Tags