విలీనం పూర్తి : 2500 మంది ఉద్యోగులకు ఎసరు

8 Sep, 2018 16:04 IST

న్యూఢిల్లీ : ఐడియా-వొడాఫోన్‌ కంపెనీల విలీనం పూర్తయింది. ఈ రెండు సంస్థలు కలిసి దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా అవతరించాయి. ఈ నేపథ్యంలో ఐడియా-వొడాఫోన్‌లు తమ హెడ్‌కౌంట్‌ను(ఉద్యోగుల సంఖ్యను) 15వేలకు కుదించాలని ప్లాన్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల్లో 17,500 నుంచి 18వేల మంది ఉద్యోగులున్నారు. అంటే వీరిలో 2500 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసేయాలని ఐడియా-వొడాఫోన్‌లు నిర్ణయించాయి. 

విలీనం సందర్భంగా 10 బిలియన్‌ డాలర్ల పొదుపు ప్రణాళికను అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులపై వేటు పడుతోంది. కొంతమంది ఉద్యోగులను పేరెంట్‌ కంపెనీలు వొడాఫోన్‌ గ్రూప్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌లోకి తీసుకుని, మిగతా కొంతమందిపై వేటు వేయాలని ఈ విలీన సంస్థ ప్లాన్‌ చేసింది. అంతేకాక ఉద్యోగులకు ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను కూడా ప్ర​స్తుతం పక్కన పెట్టింది. అయితే ఉద్యోగుల వేటుకు సంబంధించిన వార్తలు మార్కెట్‌లో చక్కర్లు కొడుతుండటంతో, ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని వొడాఫోన్‌ ఇండియాకొట్టిపారేసింది. 

‘కొంతవరకు హేతుబద్దీకరణ ఉంటుంది. అది సర్వసాధారణం. కంపెనీ వచ్చే కొన్ని నెలల్లో ఉద్యోగుల సంఖ్యను 2000 నుంచి 2500 మందిని తగ్గించుకోవాలనుకుంటుంది’ అని ఈ విషయం తెలిసిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. అయితే ఉద్యోగుల సంక్షేమాన్ని కంపెనీ పట్టించుకుంటుందని, సెవరెన్స్‌ ప్యాకేజీలను అందిస్తుందని, పేరెంట్‌ గ్రూప్‌ ఆదిత్యా బిర్లా గ్రూప్‌లో ఇంటర్నల్‌ ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే టెలికాం కంపెనీల్లో ఉద్యోగుల కోత ఇదేమీ కొత్త కాదు. రిలయన్స్‌ జియో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత, టెలికాం రంగం అస్తవ్యస్తమైంది.

ఇక అప్పటి నుంచి టెలికాం కంపెనీలు పోటీని తట్టుకోలేక, వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేటు వేయడం ప్రారంభించాయి. వొడాఫోన్‌ ఇండియా కూడా వాలంటరీ అట్రిక్షన్‌ను ఆఫర్‌చేస్తుంది. దీంతో ఆటోమేటిక్‌గా ఉద్యోగుల సంఖ్య తగ్గించేస్తుంది. అయితే వొడాఫోన్‌ ఇండియా ఉద్యోగులను, ఐడియా సెల్యులార్‌ ఉద్యోగులను విలీన సంస్థ సమానంగా చూస్తోంది. ఉద్యోగులందరిన్నీ ఎంతో గౌరవంగా చూస్తున్నట్టు వొడాఫోన్‌ ఐడియా హెచ్‌ఆర్‌ హెడ్‌ చెప్పారు. 

Tags