ఉందామా.. పోదామా..

8 Sep, 2018 15:42 IST
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేఎస్‌ రత్నం

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కేఎస్‌ రత్నం ఆదివారం తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. రెండు రోజులుగా కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాలు జరిపిన ఆయన చేవెళ్ల మండల కేంద్రంలో రేపు జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కాలె యాదయ్య చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో రత్నం పరాజయం పాలయ్యారు. అనంతరం జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో యాదయ్య టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.దీంతో పార్టీలో రత్నం ప్రాబల్యం తగ్గింది. దీనికితోడు మంత్రి మహేందర్‌రెడ్డితో కూడా వ్యక్తిగత విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది.

అయినప్పటికీ పార్టీ వీడని ఆయన.. తన అనుచరవర్గంతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి తప్పకుండా తనకే టికెట్‌ లభిస్తుందని ఆశించారు. అనూహ్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే యాదయ్య అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గుచూపడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో గురువారం రాత్రి సన్నిహితులతో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరించారు. శుక్రవారం మొయినాబాద్‌లో కూడా అనుచరులతో భేటీ అయిన రత్నం.. పార్టీలో కొనసాగాలా? కాంగ్రెస్‌ గూటికి చేరాలా? అనే అంశంపై ఆదివారం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. టికెట్‌ ఇవ్వకుండా అవమానించిన పార్టీలో ఇమడలేమని, పార్టీ మారడమే ఉత్తమమని మెజార్టీ అభిప్రాయం వ్యక్తమైంది.

ఇదిలావుండగా, అసంతృప్తితో ఉన్న రత్నంను ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుజ్జగింపులకు దిగినట్లు తెలిసింది. తొందరపడి ఎలాంటి నిర్ణయమూ తీసుకోవద్దని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ మీ ఇద్దరిని పిలిచి మాట్లాడతారని భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారంలోపు పిలుపు రాకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని రత్నం నిర్ణయించినట్లు ఆయన అనుచరవర్గం స్పష్టం చేస్తోంది. చేవెళ్ల కాకుండా వికారాబాద్‌కు వెళ్లాలనే ప్రతిపాదనను టీఆర్‌ఎస్‌ అధిష్టానం తెచ్చినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Tags