కాంగీ రేసులో!

8 Sep, 2018 12:06 IST

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రదర్శిస్తున్న దూకుడు నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. రాబోయే ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల మూడ్‌ వచ్చేసిన నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అభ్యర్థుల జాబితాను పీసీసీ సిద్ధం చేసింది. టీఆర్‌ఎస్‌ మాదిరిగా కాంగ్రెస్‌ కూడా దాదాపు పాత వారికే టిక్కెట్లు కేటాయించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఈ మేరకు తొలి జాబితాలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను దాదాపు 11 స్థానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పొత్తులు తదితర అంశాల నేపథ్యంలో మూడు స్థానాలను పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. మొదటి విడతలో ఖరారైన జాబితాను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఈనెల 12న అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పట్టు బిగించేందుకు కసరత్తు
రాష్ట్రంలోనే కాంగ్రెస్‌ పార్టీకి పాలమూరు ప్రాంతంలో బలమైన ఫునాది కలిగి ఉన్నాయని చెప్పొచ్చు. ఈ మేరకు పట్టును సుస్థిరం నిలుపుకునేందుకు ఆ పార్టీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గత సాధారణ ఎన్నికల మాదిరిగా ఈ సారి కూడా గణనీయమైన సీట్లు సాధించాలని యోచిస్తోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సునామీ ధాటికి కాంగ్రెస్‌ విలవిల్లాడినా పాలమూరు ప్రాంతంలో మాత్రం ఎదురొడ్డి నిలిచింది. ఏకంగా అయిదు అసెంబ్లీ స్థానాలైన గద్వాల, అలంపూర్, వనపర్తి, మక్తల్, కల్వకుర్తిలో విజయకేతనం ఎగురవేసింది. అంతేకాదు రాజకీయ పునరేకీకరణలో భాగంగా గులాబీ దళపతి కేసీఆర్‌ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష కూడా పాలమూరులో అంతగా ప్రభావం  చూపలేదు.

ఐదు మంది ఎమ్మెల్యేల్లో మక్తల్‌ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఒక్కరే టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. పటిష్టమైన పార్టీ కేడర్‌ నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ వైపు చూడడానికి సాహసించలేదని చెబుతారు. అంతేకాదు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారగా.. కొడంగల్‌లో టీడీపీ నుంచి గెలుపొందిన ఎనుముల రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చెరిగే రేవంత్‌ కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ కేడర్‌లో మరింత జోష్‌ పెరిగింది. అలాగే ఇటీవలి కాలంలో నారాయణపేటలో శివకుమార్‌రెడ్డి, దేవరకద్రలో న్యాయవాది జి.మధుసూదన్‌ రెడ్డి(జీఎంఆర్‌) వంటి నేతలు చేరడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లయింది.

టీఆర్‌ఎస్‌ బాటలో...
ముంచుకొస్తున్న ముందస్తు ఎన్నికల బరిలో నిలిచే రేసు గుర్రాల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ కూడా టీఆర్‌ఎస్‌ను అనుసరిస్తోంది. దాదాపు 90శాతం పాత అభ్యర్థులనే టీఆర్‌ఎస్‌ ఖరారు చేసి ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా 2014లో పోటీ చేసిన అభ్యర్థులకే పెద్ద పీట వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బలంగా ఉండడం... ఓడిపోయన చోట ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారికి సెంటిమెంట్‌ కలిసి వస్తుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకు అనుగుణంగా సిట్టింగ్‌ స్థానాలైన గద్వాల, అలంపూర్, కొడంగల్, వనపర్తి, కల్వకుర్తి, పరిగిల్లో పాత కాపులకే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే అచ్చంపేట, కొల్లాపూర్, దేవరకద్ర లలో గతంలో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం ఇవ్వాలని సూచనప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. అలాగే పార్టీలోకి ఇటీవలి కాలంలో కొత్తగా వచ్చిన సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌రెడ్డికి నాగర్‌కర్నూల్, టీఆర్‌ఎస్‌ నుంచి చేరినకుంభం శివకుమార్‌కు నారాయణపేట టిక్కెట్‌ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు చోట్ల పెండింగ్‌
రాష్ట్రంలో బలమైన టీఆర్‌ఎస్‌ పార్టీని గద్దె దింపడం కోసం కాంగ్రెస్‌ అధిష్టానం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కూటమిగా జతకట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాస్త బలం ఉండి.. ఓటు బ్యాంకు కలిగిన ప్రతీ రాజకీయ పార్టీని కలుపుకుని పోవాలని భావిస్తోంది. ఇలా టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిని కలుపుకుని ఎన్నికల బరిలో నిలవాలనేది వారి యోచనగా తెలుస్తోంది. అదే జరిగితే సర్దుబాట్ల కోసం ఉమ్మడి పాలమూరులోని మూడు అసెంబ్లీ స్థానాల విషయంలో పార్టీ అధిష్టానం పెండింగ్‌లో ఉంచినట్లు సమాచారం. పొత్తు పొడిస్తే ఆయా స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతానికి మహబూబ్‌నగర్, జడ్చర్ల, మక్తల్‌ నియోజకవర్గాల అభ్యర్థులను అధిష్టానం పెండింగ్‌లో ఉంచినట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత ఫోటోలు
Tags