సత్తువకు బత్తాయి

8 Sep, 2018 00:11 IST

హాస్పిటల్‌లో ఉన్న రోగులకూ, కోలుకుంటున్న వ్యక్తులకూ ఇచ్చే పళ్ల రసం సాక్షాత్తూ బత్తాయి రసమే తప్ప మరోటీ ఇంకోటీ కాదు. బత్తాయితో ఒనగూరే ఆరోగ్యప్రయోజనాల గురించి చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలదూ! బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇంకా అనేకం ఉన్నాయి. విటమిన్‌–సి పుష్కలంగా ఉండే బత్తాయితో రోగనిరోధక శక్తి సమకూరుతుందన్న సంగతి తెలిసిందే. రోగులకు దీనిని ఇచ్చేందుకు మరో కారణమూ ఉంది. గ్లూకోజ్‌తో తేలిగ్గా కలిసిపోయే ఇందులోని లిమోనాయిడ్స్‌ అనే పోషకాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి.  బత్తాయిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని పెంపొందించి జీర్ణవ్యవస్థ కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. అజీర్తి, పేగుల కదలికలు సక్రమంగా లేకపోవడం (ఇర్రెగ్యులర్‌ బవెల్‌ మూవ్‌మెంట్స్‌) వంటి సమస్యలను బత్తాయి సమర్థంగా చక్కదిద్దుతుంది. ఒంట్లోని విషపదార్థాలను బయటకు సమర్థంగా పంపడంలో బత్తాయి బాగా తోడ్పడుతుంది. అందుకే దీన్ని శక్తిమంతమైన డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌గా పరిగణిస్తారు.  బత్తాయిలోని విటమిన్‌–సి ఇన్‌ఫ్లమేషన్‌నూ (నొప్పి, మంట, వాపు)లను తేలిగ్గా తగ్గిస్తుంది. బత్తాయిలోని ఈ గుణం వల్లనే రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ రోగులకు ఉపశమనం కోసం పళ్ల రసాన్ని ఇస్తుంటారు. 
     
బత్తాయి రసంలో కొలెస్ట్రాల్‌ పాళ్లను అదుపు చేసే స్వభావం ఉంది. అలాగే దీనిలో పోటాషియమ్‌ కూడా పుష్కలంగా ఉంది. ఈ కారణంగా బత్తాయికి రక్తపోటును నివారించే గుణమూ ఉంది.  బత్తాయిలోని పొటాషియమ్‌ మూత్రపిండాల్లోని అనేక విషాలను బయటకు నెట్టేస్తుంది. బ్లాడర్‌ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని విటమిన్‌–సి యూరినరీ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అందుకే ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని క్యాల్షియమ్‌ ఎముకలకు మేలు చేస్తుంది. అంతేకాదు... ఇదే క్యాల్షియమ్‌ ప్రత్యేకంగా గర్భవతుల్లో పిండం అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది.   మెదడూ, నాడీవ్యవస్థ చురుగ్గా పనిచేయడానికి బత్తాయి బాగా సహాయపడుతుంది.  

Tags