బాకీ తీర్చడం లేదని..

8 Sep, 2018 07:23 IST

తూర్పు గోదావరి, అంబాజీపేట (పి.గన్నవరం): ఇచ్చిన అప్పు మూడేళ్లయినా తిరిగి ఇవ్వకపోవడంతో బాకీ దారుడు ఇంటి వద్దే దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనమిది.. అయినవిల్లి మండలం వెలవలపల్లికి చెందిన పొత్తూరి వెంకటేశ్వరరాజు, బంగారమ్మలు అంబాజీపేట మండలం కె.పెదపూడికి చెందిన బొక్కొ చిట్టిబాబుకు రూ.రెండు లక్షలు మూడేళ్ల క్రితం అప్పుగా ఇచ్చారు. అప్పటి నుంచి పదేపదే అప్పు తీర్చాలని చిట్టిబాబును ఆ దంపతులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు.

ఈ విషయంపై గ్రామ పెద్దల్లో తగవు పెట్టిన చిట్టిబాబు డబ్బులు ఇవ్వలేదు. గురువారం రాత్రి చిట్టిబాబు ఇంటికి వచ్చి రూ.రెండు లక్షలు బాకీ తీర్చమని ప్రాధేయపడినా అతను పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్యాభర్తలు వెంకటేశ్వరరాజు, బంగారమ్మలు కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలుపుకొని చిట్టిబాబు ఇంటివద్దే తాగేశారు. ఈ విషయాన్ని తమ కుమారుడైన జయరాజ్‌కు ఫోన్‌ ద్వారా వివరించారు. పురుగులు మందు సేవించిన దంపతులిద్దరినీ అమలాపురం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని చెప్పారు. జయరాజు ఫిర్యాదు మేరకు హెడ్‌ కానిస్టేబుల్‌ వై.సూర్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Tags