బాబు మోసకారి

7 Sep, 2018 13:59 IST
మాట్లాడుతున్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పక్కన ప్రసన్నకుమార్‌రెడ్డి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబు మోసకారి అని, ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోవూరు మండలం పడుగుపాడు రుక్మిణి కల్యాణ మండపంలో గురువారం జరిగిన కోవూరు నియోజకవర్గ బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు బీజేపీతో దోస్తీ చేసి నేడు మోదీని విమర్శిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాడన్నారు. అంతటితో ఆగక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండి పడ్డారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ నుంచి మైనార్టీలను, బీసీలను, షెడ్యూల్డ్‌ తెగలను దూరం చేయాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడన్నారు.

వాటిని తిప్పి కొట్టే దిశగా బూత్‌ కమిటీ కన్వీనర్లలందరూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కోవూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లాకు తెలుగుగంగ తెచ్చి నీటి కొరత తీర్చిన గొప్ప నాయకుడన్నారు. ఆయన కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి  ఈ నాలుగేళ్లలో ఎమ్మెల్యే కాకపోయినా నాతో పాటు ఎందరో నేతల నుంచి కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించారన్నారు. ఆయన గెలుపునకు సమష్టిగాకృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ అభ్యర్థిగా తన గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం బూత్‌ కమిటీ నెల్లూరు జిల్లా ఇన్‌చార్జి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన అధ్యాయాన్ని సృష్టించారన్నారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించి ప్రజల బాధలను తెలుసుకుంటున్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులందరూ విజయం సాధించాలన్నారు. ఎన్నికల్లో బూత్‌ కమిటీలే కీలకమన్నారు. బూత్‌ కమిటీ కన్వీనర్లు క్రమశిక్షణతో పనిచేసి కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రసన్నకుమార్‌ రెడ్డి గెలుపొందేందుకు కష్టపడాలని ఆయన కోరారు.
కోవూరు నుంచే పోటీ చేస్తా–  నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

జిల్లాలో తనపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు నాలుగేళ్లుగా టీడీపీ నేతల అరాచకాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. అయినా నేటికీ తన వెంటే ఉన్నామని బూత్‌ కమిటీ సమావేశానికి వచ్చి రుజువు చేశారన్నారు. మీలాంటి వ్యక్తులు దొరకడం నా అదృష్టమని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమన్నారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నదే తన లక్ష్యమన్నారు. టీడీపీ నేతల అరాచకాలకు చరమగీతం పాడుదామన్నారు. ఎన్నికలను ఎన్నికల్లా చేయాలని, తానున్నానని భరోసా ఇచ్చారు. సీఎం కుర్చీలో జగన్‌మోహన్‌రెడ్డిని కూర్చోబెట్టాలన్నారు. ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యేగా తాను కోవూరు నియోజకవర్గ అభివృద్ధి చేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆనందంగా ఉండే రోజు త్వరలో రానునందన్నారు. అందరూ కలిసికట్టుగా విజయం సాధించే దిశగా ముందుకు సాగుదామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబురెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, సూరా శ్రీనివాసులురెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణయ్య, నాపా వెంకటేశ్వర్లునాయుడు, వీరి చలపతిరావు, షేక్‌ అల్లాబక్షు, బూత్‌ కమిటీ నియోజకవర్గ కన్వీనర్‌ స్వర్ణా సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags