ఒక్క తీర్పులో ఎన్ని తీర్పులో!

7 Sep, 2018 18:07 IST

సాక్షి, న్యూఢిల్లీ : సమాజంలో లెస్బీయన్లు, గేలు, బైసెక్సువల్స్, ట్రన్స్‌జెండర్లు (ఎస్‌జీబీటీలు) కూడా వ్యక్తులేనని, వారికి కూడా వ్యక్తిత్వం, మానవత్వం ఉంటాయని, వారికి ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని, వారి మధ్య లైంగిక సంబంధాలను నిషేధిస్తున్న 377వ సెక్షన్‌ చెల్లదంటూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. ఈ తీర్పు ఒక్క ఎస్‌జీబీటీల విజయమే కాదు, భారత పౌరులందరి విజయంగా పేర్కొనవచ్చు.

అన్ని హక్కులకన్నా ప్రాథమిక హక్కులు ముఖ్యమని ఈ తీర్పు చెప్పడమే కాకుండా సమాజంలో మెజారిటీ, మైనారిటీ అని తేడా లేకుండా అందరికి సమానంగా ప్రాథమిక హక్కులు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తద్వారా భిన్నత్వంలో ఏకత్వానికున్న ప్రాధాన్యతను తెలియజేసింది. దేశంలో అతి తక్కువగా ఉన్న ఎస్‌జీబీటీల కోసం ఎప్పటి నుంచో చట్టంలో కొనసాగుతున్న 377వ సెక్షన్‌ను కొట్టివేయలేమని 2013లో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

స్ఫూర్తిదాయకమైన సుప్రీం కోర్టు తీర్పునకు కారణమైంది భారత రాజ్యాంగంలోని 32వ అధికరణం. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లే అధికారాన్ని ఈ అధికరణ కల్పిస్తోంది. అందుకనే ఈ అధికరణ కిందనే ఎస్‌జీబీటీలు తమ వాదనను కోర్టుకు నేరుగా వినిపించగలిగారు. ఈ ‘32వ అధికరణ’నే మొత్తం రాజ్యాంగానికి ఆత్మ, హృదయమని నాటి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ స్వయంగా నాటి రాజ్యాంగ పరిషద్‌లో నొక్కి చెప్పారు. భారత రాజ్యాంగం ఓ బండరాయి కాదని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే వీలున్న ‘పరివర్తనా రాజ్యాంగం’ అని కూడా సుప్రీం తాజా తీర్పు సూచిస్తోంది. తీర్పు చెప్పిన జడ్జీల్లో ఒకరు ‘పరివర్తనా రాజ్యాంగం’ అని వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం కూడా. 2013లో ఎస్‌జీబీటీల వాదనను తిరస్కరించిన సుప్రీం కోర్టు 2018 నాటికి వారి వాదనకు సానుకూలంగా స్పందించడమే అందుకు నిదర్శనం.

Tags