కుటుంబం పరువు పోతుందనే.. వివాహిత ఆత్మహత్యాయత్నం

6 Sep, 2018 13:04 IST
వివరాలు తెలుసుకొంటున్న డీఎస్పీ గంగాధరం

గుంటూరు, పొన్నూరు: కుటుంబం పరువు పోతుందనే బాధతో వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... బాపట్ల మండలం కంకటపాలేనికి చెందిన వివాహిత గత సోమవారం కుమారుడికి నూతన వస్త్రాలు తీసుకొనుటకు బాపట్ల వెళ్లింది. అదే గ్రామానికి చెందిన నల్లమోతుల భీమయ్య ద్విచక్రవాహనంతో ఆమెను అడ్డగించి బైక్‌ ఎక్కమన్నాడు. దీనితో మహిళ భయపడి పక్కనే ఉన్న వస్త్రాల షాపులోకి వెళ్లింది. దీనితో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వివాహిత నూతన వస్త్రాలు తీసుకొని కంకటపాలెం వెళ్లేందుకు బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడే ఉన్న భీమయ్య ఆమెను బెదిరించి బైక్‌ ఎక్కమని అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడి తన పుట్టిల్లు చేబ్రోలు వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు విషయం తెలిపి వారిని వెంట పెట్టుకొని కంకటపాలెం వచ్చింది. జరిగిన విషయం భీమయ్య కుటుంబ సభ్యులకు వివరించగా, వారు భీమయ్య మంచివాడు అంటూ వెళ్లిన వీరిని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత బుధవారం ఉదయం పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన బంధువులు వెంటనే పొన్నూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. దీనితో అసలు విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న బాపట్ల డీఎస్పీ డి.గంగాధరం వివాహితను విచారించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యప్తుచేస్తున్నారు.

భీమయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలి
బాపట్ల: కంకటపాలెంకు చెందిన వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అదే గ్రామానికి నల్లమోతు భీమయ్యను అరెస్టు చేయాలని శ్రీఆదివాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరువీధుల శంకరప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని బుధవారం ఆయన పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పరామర్శించిన వారిలో కేఎస్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, కిషోర్, బలగాని వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Tags