‘పార్టీ మారిన గాడిదలకు చంద్రబాబు టికెట్‌ ఇవ్వడు’

6 Sep, 2018 19:25 IST
అంబటి రాంబాబు

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తాడు గానీ, అమ్ముడుపోయిన గాడిదలకు కాదని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సభ ఉండదనీ, అసెంబ్లీలో సభా సంప్రదాయాలు, విలువలున్నాయా అని ప్రశ్నించారు. నైతిక విలువల గురించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాట్లాడడం చిత్రంగా ఉందన్నారు. స్పీకర్‌ వ్యవస్థను కోడెల శివప్రసాద్‌ భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. అన్ని విషయాలపై మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఫిరాయింపు దారులపై ఎందుకు మౌనం వహిస్తారని అన్నారు. 

వైఎస్ జగన్‌ని దూషించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. టీడీపీలో టికెట్‌ రాకపోతే చంద్రబాబుని తిడతారని అంబటి జోస్యం చెప్పారు. ఎన్నికలంటే మేము వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలపై ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారనీ, చంద్రబాబుకు అంత ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో 175 అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, 25 ఎంపీ నియోజకవర్గ ఇంచార్జిలు, పార్టీ ముఖ్య నేతలతో విశాఖపట్నంలో ఈ నెల 11న సమావేశం జరగనుందని ఆయన వెల్లడించారు.

Tags