రూపీ రికవరీ : మార్కెట్లు జంప్‌

6 Sep, 2018 16:30 IST
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : స్టాక్‌ మార్కెట్లను, ఇన్వెస్టర్లను వణికిస్తున్న రూపీ రికవరీ అయింది. రూపీ రికవరీతో మార్కెట్లు హమ్మయ్య అనుకున్నాయి. ఆల్‌-టైమ్‌ కనిష్ట స్థాయిల్లో 72.10 వద్ద నమోదైన రూపాయి, ట్రేడింగ్‌ ముగింపులో కోలుకుంది. దీంతో నిఫ్టీ 11,500 మార్కును పునరుద్ధరించుకుంది. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పైగా జంప్‌ చేసింది. కరెన్సీ సహకారంతో పాటు, హెవీ వెయిట్‌ ఉన్న స్టాక్స్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ స్టాక్‌ సూచీలకు లాభాల పంట అందించాయి. ఫార్మాస్యూటికల్స్‌, ఎనర్జీ, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్‌ రంగాలు కూడా మార్కెట్లకు బలంగా నిలిచాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 225 పాయింట్ల లాభంలో 38,242.81 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంలో 11,536 వద్ద స్థిరపడ్డాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మాస్యూటికల్స్‌, సిప్లా టాప్‌ గెయినర్లుగా నిలువగా.. మారుతీ సుజుకీ, యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిందాల్కో ఎక్కువగా నష్టపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో అత్యంత కనిష్ట స్థాయి 72.10 మార్కు నుంచి కోలుకుని, 71.85 వద్ద నమోదైంది. కాగా, గత కొన్ని రోజులుగా పాతాళ స్థాయికి పడిపోతున్న రూపాయితో, మార్కెట్లు కూడా భారీగానే నష్టపోతున్నాయి. ఆరు సెషన్ల నుంచి మార్కెట్లు నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. నేడు ఈ నష్టాలకు తెరపడి, మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  

Tags