దళితునిపై అగ్రవర్ణాల దాడి

6 Sep, 2018 15:16 IST
డీఎస్పీ చుట్టు ముట్టి ప్రశ్నిస్తున్న దళితులు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న దేవదాసు

యర్రగొండపాలెం: నేటి టీడీపీ పాలనలో దళితులపై దాడులు హెచ్చిమీరుతున్నాయి. తాజాగా మండలంలోని అమానిగుడిపాడులో మంగళవారం రాత్రి ఇలాంటి ఘటనే జరిగింది. మందా దేవదాసు అనే వ్యక్తిపై గ్రామానికి చెందిన ముగ్గురు అగ్రవార్ణానికి చెందినవారు కులం పేరుతో దూషిస్తు దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన దేవదాసు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతుండగా బుధవారం ఉదయం నిందితులు ముసుగులు ధరించి బాధితుడి గొంతుకోసి సాక్ష్యం లేకుండా హతమార్చటానికి ప్రయత్నించారు. అమానిగుడిపాడులో తొలుత దాడి జరిగిన సమయంలో ఉన్న మరో వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని బెదిరించారు. అందుకు నిరాకరించిన అమృతపూడి బాబు అనే వ్యక్తిని కులంపేరుతో దూషిస్తు కాళ్లతో తన్నారని ఆయన భార్య హెప్సీరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తెలిపిన వివరాల మేరకు.. అమానిగుడిపాడు ఎస్సీ కాలనీకి చెందిన మందా దేవదాసు మంగళవారం తమ గ్రామంలోని మద్యం షాపువద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న లక్ష్మయ్య అనేవ్యక్తి తనకు ఇవ్వవలసిన బాకీ అడిగాడు. తాను తీసుకున్న రూ. 3వేలు అసలు, వడ్డీకింద మరో రూ. 3వేలు కలిపి రూ. 6వేలు దఫాలుగా చెల్లించానని, ఇక తాను కట్టలేనని దేవదాసు చెప్పాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న వేగినాటి ఆనందకుమార్, జాగర్లమూడి సూరయ్య, మూతి శ్రీను అనేవారు దేవదాసును కులం పేరుతో దూషించడం మొదలు పెట్టారు.

మీకు సంబంధంలేని విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని దేవదాసు ప్రశ్నించడంతో వెంటనే అతనిపై దాడి చేసి కాళ్లు, చేతులతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో భీతిల్లిన దేవదాసు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత తనభార్య మూగమ్మతో కలిసి వైపాలెంలోని ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఉదయం 5గంటల ప్రాంతంలో దేవదాసు బహిర్భూమికి వెళ్లాడు. అయితే అక్కడ కాపుకాసి ఉన్న నిందితులు తిరిగి అతనిపై దాడి చేశారు. సాక్ష్యం లేకుండా హతమార్చాలనే ఉద్దేశంతో గొంతుకోసి పారిపోయారు. విషయం తెలుసుకున్న అమానిగుడిపాడు ఎస్సీ పాలెం వారితో పాటు దళిత నాయకులు వైద్యశాలవద్దకు చేరుకున్నారు. వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీగా స్థానిక వైఎస్సార్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ దాదాపు గంటపాటు రాస్తారోకో చేశారు.

దళితవాడలను శ్మశానాలుగామార్చుతారా?
టీడీపీ ప్రభుత్వం దళితవాడలను శ్మశానాలుగా మార్చాలనుకుంటోందని దళిత సంఘాలకు చెందిన నాయకులు ఆరోపించారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి మండాది పీటర్‌ మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతున్నాయని, హత్యలు, అత్యాచారాలు పెరిగి పోయాయని ఆరోపించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే చుండూరు, కారంచేడు సంఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. పలుకుబడిఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయడంలేదని ఆయన విమర్శించారు. వెంటనే నిందితులను అరెస్ట్‌ చేయాలని అప్పటి వరకు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు.

తక్షణమే అరెస్ట్‌ చేస్తాం
నిందితులను పట్టుకొని తక్షణమే అరెస్ట్‌ చేస్తామని మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. రాస్తారోకో చేస్తున్న దళితులు, ప్రజా సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. దాడులు జరిపిన నిందితులను ఉపేక్షించేదిలేదని, వారు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసును త్వరితగతిన ముందుకు సాగేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అమానిగుడిపాడులో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు డివిజన్‌ పరిధిలోని దళితనాయకులతో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఆర్‌.ప్రసాద్, కె.గురవయ్య, సింగా ప్రసాద్, సీపీఐ నాయకుడు డి.శ్రీనివాస్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కె.కళావతి, రైతుసంఘం డివిజనల్‌ కార్యదర్శి డి.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

Tags