భార్యను కడతేర్చిన భర్త

5 Sep, 2018 12:44 IST
మంచంపై రక్తపు మడుగులో ఉన్న కమలమ్మ. (అంతరచిత్రాలు) కమలమ్మ (ఫైల్‌), పోలీసులకు లొంగిపోయిన భర్త సుందర్‌రావు

కృష్ణాజిల్లా, రావిరాల (జగ్గయ్యపేట) : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను మందలించినా వినకపోవటంతో విసుగు చెందిన భర్త ఇనుప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన మండలంలోని జయంతిపురం గ్రామ పంచాయతీ రావిరాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఇనుపనుర్తి సుందర్‌రావు గ్రామంలోని సిమెంట్‌ కర్మాగారం మైనింగ్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి 30 ఏళ్ల క్రితం వీరులపాడు మండలం వెల్లంకి గ్రామానికి చెందిన కమలమ్మ (47) తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారికి వివాహాలు కూడా అయ్యాయి. అయితే కొన్ని నెలలుగా కమలమ్మ ఫోన్‌లో తరచూ మాట్లాడటం,  కూలీ పని ఉందని బయటకు వెళ్తుండటంతో భర్త సుందర్‌రావుకు అనుమానం వచ్చి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్నట్లు గమనించి వారం రోజుల క్రితం భార్యను హెచ్చరించాడు.

దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరగటంతో కమలమ్మ పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం భర్త, కుమారుడు తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం పని నుంచి వచ్చిన సుందర్‌రావు ఇంట్లో భార్య లేకపోవటంతో పాటు కోడలు పుట్టింటికి వెళ్లటంతో డ్యూటీలో ఉన్న కుమారుడికి ఫోన్‌ చేశాడు. ‘మీ అమ్మ ఎక్కడకెళ్లింది’ అని అడిగాడు. కుమారుడు కూడా తెలియదని చెప్పాడు. రాత్రి 8 గంటల సమయంలో కమలమ్మ ఇంటికి వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లావని అడగటంతో రాత్రి ఒంటి గంట వరకు ఘర్షణ పడుతూనే ఉన్నారు. ఆగ్రహించిన సుందర్‌రావు మంచంపై పడుకుని ఉన్న కమలమ్మను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఇనుప రాడ్డును అటకపై పడేసి తన ద్విచక్ర వాహనంపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సీఐ జయకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త నేరం అంగీకరించటంతో పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Tags