చార్మినార్‌ కూడా తానే కట్టానని చెబుతాడు

5 Sep, 2018 12:31 IST

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు గురించి ఏపీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాద్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాజ్యసభ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు హితవు పలికారు. అందుకోసమే కోడెలకు 28 ప్రశ్నలతో లేఖ రాశానని తెలిపారు. కానీ కోడెల అసత్యాలతో ఆ ప్రశ్నలకు బదులిచ్చారని వెల్లడించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ గణాంకాలే కోడెల చెబుతున్నారని  ధ్వజమెత్తారు.

పోలవరంపై కోడెల సమాధానం ఆయన అవగాహన రాహిత్యాన్ని తెలియజేస్తుందన్నారు. పోలవరం అంటే హెడ్‌వర్క్స్‌ మాత్రమే కాదని, ఆ విషయం కోడెల తెలుసుకోవాలని చెప్పారు. పోలవరంపై తప్పిదాలను స్పీకర్‌ సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది..పరిశీలన చేసుకోండని హితవు పలికారు.

చంద్రబాబు నాయుడు అసత్యాలు చెబుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నాడు.. అవసరమైతే చార్మినార్‌ కూడా తానే కట్టానని చెబుతాడని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కాంగ్రెస్‌ అన్ని అనుమతులు ఇచ్చిందని, ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఎప్పటికి పోలవరం పూర్తి అవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని  విమర్శించారు. పోలవరంపై చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలు ఆయన తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని విమర్శించారు.

Tags