గుట్కా స్కాం: మంత్రి, డీజీపీకి సీబీఐ భారీ షాక్‌

5 Sep, 2018 11:53 IST

చెన్నై: తమిళనాడులో గుట్కా స్కాంకు సంబంధించి సీబీఐ భారీ సోదాలు నిర్వహించింది. గుట్కా కుంభకోణంలో విచారణలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైలోని 40ప్రాంతాలలో  సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు దాడులు చేశారు.  ముఖ్యంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి  విజయబాస్కర్, డీజీపి టికె రాజేంద్రన్‌తోపాటు మాజీ పోలీసు కమిషనర్ జార్జ్, ఇతర పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. బుధవారం ఉదయం 7గంటలకు ప్రారంభమైన దాడులు సంచలనంగా మారాయి.

కోట్లాది రూపాయల గుట్కా కుంభకోణంలో రాష్ట్ర మంత్రి, రాష్ట్ర పోలీసు అధికారులతోపాటు  ఇతర ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్టాయన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ  భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న మాధవరావు అనే  వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, రహస్య నోటు ఆధారంగా విచారణ చేపట్టాల్సిందిగా  డీఎంకే ఎమ్మెల్యే జే అన్బజగన్ దాఖలు చేసారు. దీంతో  మద్రాస్‌ హైకోర్టు ఏప్రిల్‌లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా   2017జులైలో రూ.250 కోట్ల గుట్కా కుంభకోణం వెలుగులోకి  వచ్చింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డీఎంకే ఎమ్మెల్యే జే అన్బజగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో విచారణకు రావడంతో ఐటీ శాఖ కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం పొయెస్‌గార్డెన్‌లోని వీకే శశికళ గదిలో గుట్కా కుంభకోణానికి సంబంధించిన రహస్య నోటు తమ తనిఖీల్లో దొరికిందని ఇటీవల ఐటీ శాఖ తెలిపింది.  ఐటీ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ సూయిజ్ బాబు వర్గీస్  మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. 2017 నవంబర్‌లో పొయెస్ గార్డెన్‌లోని శశికళ నివాసం ఉన్న గదులను తనిఖీ చేసినప్పుడు ఈ నోటు దొరికిందన్నారు. 2016 ఆగస్టు 11న గుట్కా కుంభకోణంలో జప్తు చేసిన వస్తువులు, పత్రాలకు సంబంధించిన రహస్యనోట్‌ కూడా అప్పటి సీఎంకు పంపినట్లు అందులో ఉంని తెలిపారు. 2016 సెప్టెంబర్ రెండో తేదీన నాటి డీజీపీ సంతకం చేసి, అప్పటి సీఎం జయలలితకు పంపినట్లు ఉన్నదని పేర్కొన్నారు.  2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 16 వరకు ఆరోగ్యశాఖ మంత్రికి రూ.56 లక్షల ముడుపులు చెల్లించారని, మంత్రి, పోలీస్ కమిషనర్లకు ముడుపులు చెల్లించినట్లు డైరీలో రాసుకున్న వివరాలు ఉన్నాయని పేర్కొనడం సంచలనం  రేపింది.

Tags