ఆదరణ పేరుతో మళ్ళీ కొత్త డ్రామాలు : జంగా కృష్ణమూర్తి

4 Sep, 2018 14:55 IST
జంగా కృష్ణమూర్తి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : ప్రతి మహిళను లక్షాధికారి చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం అని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైఎస్సార్ కలలు సాకారం చేయడం లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకెళ్తోందన్నారు. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 11వ జిల్లాలో కొనసాగుతోందని, ప్రతిచోటా మహిళలు తమ సమస్యలు వైఎస్‌ జగన్‌కి మొరపెట్టుకుంటున్నారని తెలిపారు.

 వైఎస్‌ జగన్ ఒక అడుగు ముందుకేసి అధికారంలోకి రాగానే వైఎస్సార్ చేయూత కార్యక్రమం చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. వైఎస్‌ జగన్ ఇచ్చిన హామీలపై అందరూ చర్చించుకుంటున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఆదరణ పేరుతో మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. ఆదరణ పథకంలో అన్ని నాసిరకం పనిముట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుందని, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ మహిళలు అందరికి వైఎస్సార్ చేయూత ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.

Tags