రాలిన విద్యా కుసుమం

4 Sep, 2018 12:51 IST
మృతి చెందిన లావణ్య

వైఎస్సార్, వేంపల్లె :  వేంపల్లె విశ్వనాథరెడ్డి కాలనీలో కె.లావణ్య(21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్లిమర్రి మండలం ఉలవలపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి వేంపల్లెలోని విశ్వనాథరెడ్డి కాలనీలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, కుమారుడు రమాకాంత్‌రెడ్డి, కుమార్తె లావణ్య ఉన్నారు. కుమారుడు వేంపల్లెలో ట్రాక్టర్, రెండు డోజర్లు పెట్టుకుని బాడుగలకు పంపుతున్నాడు. లావణ్య కడపలోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో ఆడియాలజీ, స్పీచ్‌థెరపీ కోర్సు మూడో సంవత్సరం పూర్తి చేసుకుని, నాలుగో సంవత్సరం హైదరాబాద్‌లో ట్రైనింగ్‌ చేస్తూ ఉండేది.

ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం ‘నాకు చదువుపై ఒత్తిడి పెరిగిపోతోంది.. నేను చదవలేను’ అంటూ వేంపల్లెలోని తన స్వగృహానికి వచ్చింది. తల్లిదండ్రులు మాత్రం ఇక 6 నెలల్లో కోర్సు పూర్తవుతుందని కుమార్తెకు నచ్చచెబుతుండేవారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఇంట్లో అందరూ కలసి నిద్రిస్తుండగా.. లేచి పక్కనే ఉన్న బెడ్‌రూంలో చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి 4 గంటల సమయంలో లేచి కుమార్తె తన పక్కలో కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని చూడగా.. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతుండటం చూసి విలవిలలాడింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఎస్‌ఐ చలపతి తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కోర్సు పూర్తవగానే లావణ్యను పెళ్లి కుమార్తెగా చూడాలనుకున్న తల్లి.. ఈ విధంగా జరగడంతో కన్నీటి పర్యంతమైంది.  విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags